● బాబు, పవన్.. ఒంటరిగా పోటీ చేయగలరా?
● జగన్ పాలన, కూటమి పాలనపై ప్రజల్లో చర్చ
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ముత్తుకూరు (పొదలకూరు) : వెన్నుపోటు చంద్రబాబుకు గునపం గుర్తే కరెక్ట్‌గా సరిపోతుందని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. మండలంలోని ఈపూరు, రొయ్యలపాళెంలో బుధవారం కాకాణి పర్యటించారు. దువ్వూరు విశ్వమోహన్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఐదో వార్షికోత్సవ ప్రత్యేక పూజల్లో కాకాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈపూరు అనంతరాజు వేణుగోపాల్ గృహంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు పాలనపై ప్రజలు చర్చించుకుంటున్నట్లు తెలిపారు. ఏ ఒక్క వర్గం కూటమి పాలనలో సంతృప్తిగా లేరని, పొరుగు రాష్ట్రాల విజయాలను చూసైనా పవన్‌కల్యాణ్, చంద్రబాబు నేర్చుకోవాల్సి ఉందన్నారు. వీరిద్దరూ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయగలరాని ప్రశ్నించారు. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒంటరిగా పోటీ చేసి అఖండ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజ లు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. జిల్లాలో మహానాడు ఎక్కడ జరపాలని టీడీపీ నాయకులు పోట్లాడుకుంటున్నార న్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని సీట్లు తమవేనని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్టీయార్‌ను నుంచి నమ్మిన పార్టీ నేతలను, కార్యకర్తలను ప్రధానంగా ప్రజలను గునపంతో పొడవడం అలవాటు చేసుకున్నందునే గునపం గుర్తు ఆయనకు సరిపోతుందన్నారు. తాను జోస్యం చెప్పడం లేదని ప్రజల నాడిని బట్టి వచ్చే ఎన్నికల సరళిని వివరిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలు చెబితే టీడీపీకు చెందిన బీద రవిచంద్ర జీర్ణించుకోలేక తాను జోస్యం చెపుతున్నానంటున్నాడన్నారు. కూటమి పాలనలో జరుగుతున్న మోసాలను తాము స్పష్టంగా ప్రజల దృష్టికి తీసుకుని వెళుతున్నామని, తమ ప్రభుత్వంలో ప్రతి వర్గానికి మేలు జరిగినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా గ్రామాల్లో పనులు జరగడం లేదన్నారు. సీఎస్‌ఆర్ నిధుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతున్నారని సైకిళ్ల పంపిణీ వ్యవహారంలో డీలర్ల నుంచి కమీషన్లను దండుకుంటూ ప్రజాసేవ చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఒక్కసారైనా పొత్తులు లేకుండా ఎన్నికల బరిలో నిలిచాడా అని ప్రశ్నించారు. తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీ చేసి పూర్తి మెజార్టీ రాలేకున్నా అతిపెద్ద పార్టీగా విజయం సాధించినట్లు తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా ఎల్లప్పుడు ప్రజలతోనే ఉంటామని, వారి సమస్యలపై స్పందించి పోరాటం చేస్తామని వెల్లడించారు. పార్టీ మండల కన్వీనర్ విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు దువ్వూరు విశ్వమోహన్‌రెడ్డి, దువ్వూరు నిరంజన్‌రెడ్డి, దవ్వూరు తేజారెడ్డి, అలపాక శ్రీనివాసులు, పాముల శ్రీనివాసులు పాల్గొన్నారు.


