నెల్లూరురూరల్: వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా సంస్థ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హ్యాండ్లూమ్స్ టెక్నాలజీపై మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులో శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ శాఖచే సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తామన్నారు. ఇంటర్మీడియట్ (ఎంపీసీ), ఐటీఐ ఉత్తీర్ణులైన వారు నేరుగా రెండో సంవత్సరంలో చేరొచ్చని, నెలకు రూ.2500 స్టై ఫండ్ ఇస్తామన్నారు. వివరాలకు 93999 36872, 98661 69908 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిచారు.
దువ్వూరు సమీపంలో రోడ్డు ప్రమాదం
● బస్సును ఢీకొట్టిన లారీ
సంగం: మండలంలోని దువ్వూరు సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కనిగిరి నుంచి చైన్నె వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. బస్సులోని ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మిగిలిన ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించారు. అలాగే వాహనాల రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ ముందు భాగం దెబ్బతింది.
శ్రీవారి దర్శనానికి
8 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,240 మంది స్వామిని దర్శించుకున్నారు. 28,257 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.44 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేనివారు 8 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.


