సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద వాగ్వాదం | - | Sakshi
Sakshi News home page

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద వాగ్వాదం

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ఫిర్యాదు

లేఅవుట్‌ను పరిశీలించిన

ఆడిట్‌ జిల్లా రిజిస్ట్రార్‌

పొదలకూరు: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద బుధవారం వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టణంలోని సత్యనారాయణ లేఅవుట్లో ఇటీవల ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన 286 అంకణాలను ప్లాట్లుగా మార్పుచేసి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారని అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆడిట్‌ జిల్లా రిజిస్ట్రార్‌ దీపిక విచారణ చేశారు. ఆమె విచ్చేస్తున్న సందర్భంగా ప్రజాప్రయోజన స్థలానికి సంబంధించి గతంలో ఫిర్యాదు చేసిన వారికి నోటీసులివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో కేసు నడుస్తున్న లేఅవుట్లో ప్రజాప్రయోజన స్థలాన్ని పది ప్లాట్లుగా మార్చి ఇటీవల నాలుగింటిని రిజిస్ట్రేషన్‌ చేశారు. దీంతో పంచాయతీ సెక్రటరీ యశ్వంత్‌సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై హనీఫ్‌ కొన్నవారు, అమ్మిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లను అక్రమంగా చేశారని జిల్లాస్థాయి అధికారికి ఫిర్యాదు చేయడంతో స్పందించి విచారణ నిర్వహించారు. అయితే ఇరువర్గాల వారు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్దకు చేరుకుని డాక్యుమెట్లను విచారణాధికారికి సమర్పించారు. ఓ వర్గం వారు ప్రజాప్రయోజన స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారని ప్రశ్నించారు. పంచాయతీ ఆధీనంలో ఉన్న స్థలంలో వారు మూడురోజుల క్రితం వాలీబాల్‌ కోర్టు, పార్కును ఏర్పాటు చేశారు. మరో వర్గం వారు అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయని తమకే స్థలం చెందుతుందని వాదనలు వినిపించారు. బహిరంగ మార్కెట్లో స్థలం సుమారు రూ.4 కోట్ల వరకు ధర పలుకుంది.

● రికార్డులను పరిశీలించిన దీపిక సత్యనారాయణ లేఅవుట్‌, సత్యనారాయణ ట్రేడర్స్‌ రెండు చోట్ల స్థలాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇరువర్గాలు, పంచాయతీ సెక్రటరీ వద్ద స్టేట్‌మెంట్‌ రికార్డు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక రూపొందిస్తామన్నారు. ఆమె వెంట సబ్‌రిజిస్ట్రార్‌ శోభమ్మ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement