నెల్లూరు(వీఆర్సీసెంటర్): వాణిజ్య గ్యాస్ ధరల పెంపు దారుణమని పలువురు నేతలు అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఖాళీ సిలిండర్లతో నెల్లూరులోని ఆజాద్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రదాన కార్యదర్శి యామాల మధు మాట్లాడుతూ కేంద్రం వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.993 పెంచడంతో చిన్న టిఫిన్ సెంటర్ల నిర్వాహకులపై పెనుభారం పడిందన్నారు. మూడు నెలల వ్యవధిలో 81 శాతం గ్యాస్ ధరలను పెంచడం దారుణమన్నారు. 2014లో రూ.400 ఉన్న డొమెస్టిక్ గ్యాస్ ధర నేడు రూ.1,000కి చేరువలో ఉందన్నారు. ఇది నరేంద్రమోదీ వైఫల్యానికి నిదర్శనమన్నారు. గ్యాస్ ధరలను తగ్గించాలని లేకపోతే రానున్న రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రమణయ్య, సిరాజ్, సుధాకర్, అజీజ్, లీలామోహన్, షాన్‌వాజ్, వనజ, శీనయ్య, అహ్మద్, మహీంద్ర తదితరులు పాల్గొన్నారు.


