సముద్రపు ఒడ్డున నిలిపిన పడవలు
మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది
మత్స్యకారులకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. విపత్కర
పరిస్థితుల కారణంగా చాలారోజులపాటు సముద్రంపై వేట సక్రమంగా సాగలేదు. నేటి నుంచి జూన్ 14వ తేదీ వరకు రాష్ట్ర మత్స్యశాఖ వేటకు విరామం ప్రకటించింది.
వాకాడు: వేట విరామం బుధవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి రానుంది. సముద్రంలో ఎవరూ వేటకు వెళ్లకుండా మత్స్యశాఖ, కోస్టల్ గార్డ్స్, కోస్టల్ మైరెన్ సెక్యూరిటీ పోలీస్, నేవీ అధికారులతో గస్తీ ఏర్పాటు చేయనున్నారు. మత్స్యకారులు ముందుగానే తమ బోట్లను తీరానికి తీసుకొచ్చి లంగరు వేశారు. వేట నిషేధం కట్టుదిట్టంగా అమలు చేయాలని తిరుపతి, నెల్లూరు మత్స్యశాఖ జేడీలు రాజేష్, శాంతి పర్యవేక్షణలో తీరంలో నిఘా ఉంచనున్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కాలంలో మత్స్యకారులకు పరిహారం అందించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మత్స్యకారులకు కన్నీటి కష్టాలు, అడుగడుగునా అవమానాలు తప్పడం లేదు.
పట్టించుకోకుండా..
పొరుగు రాష్ట్రాల మరబోట్ల అక్రమ వేటను అరికట్టాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల జిల్లాలోని పలువురు మత్స్యకారులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అక్రమ వేట చేసే పాండిచ్చేరి బోట్లను పట్టుకుని జువ్వలదిన్నె పోర్టు వద్ద ఉంచారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ సమస్యకు ఈ దఫాలో పరిష్కారం దొరుకుతుందని భావించిన జిల్లా మత్స్యకారులకు ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. దీంతో ఆకలి కష్టాలు తప్పవంటూ గ్రామ కాపులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
సవాలక్ష కొర్రీలు
ఈ ఏడాది వేట నిషేధ పరిహారం కోసం ఈనెల 17వ తేదీ నుంచి తీర మండలాల్లో సర్వే చేపట్టనున్నారు. అయితే ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధించింది. ఏప్రిల్ 14వ తేదీ నాటికి లైసెన్స్ రెన్యూవలై ఉండాలి. సర్వే సమయంలో బోటు యజమానితోపాటు కలాసీలంతా హాజరు కావాలి. వేట చేసే బోటుకు జరిమానా విధించి ఉండకూడదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ భరోసా వర్తిస్తుంది. వేట చేసే మత్స్యకారుడికి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. లబ్ధిదారులు సామాజిక పింఛన్ తీసుకుంటుంటే వారికి ఈ పథకం వర్తించదు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. మోటారైజ్డ్ బోటులో ఆరుగురు, సంప్రదాయ పడవలో ముగ్గురు మాత్రమే వేట సాగిస్తూ ఉండాలి. సర్వే బృందాలు మత్స్యకార గ్రామాల్లో పడవలను తనిఖీ చేస్తాయి. 19 నుంచి 22వ తేదీ వరకు సేకరించిన డేటాను ఆన్‌లైన్ చేస్తారు. 23న అర్హత పొందిన లబ్ధిదారుల జాబితాను ఆయా సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. 23 నుంచి 27వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 27న జాబితాను కలెక్టర్ ఆమోదానికి పంపడం జరుగుతుంది.
గత ప్రభుత్వంలో సాయం ఇలా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మత్స్యకార భరోసా పథకం కింద 2019 నుంచి ఏటా వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ముందుగానే రూ.10 వేలు చొప్పున జీవన భృతిగా అందజేయడం జరిగింది. భృతితోపాటు డీజిల్ సబ్సిడీ, ప్రమాద బీమా, 50 ఏళ్లకే పింఛన్ ఈ లెక్కన మొత్తంగా గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో రూ.35.50 కోట్లను భృతి కింద జగన్ సర్కారు నేరుగా వారి ఖాతాల్లో జమచేసింది.
నిబంధనలు అతిక్రమించకూడదు
ఎప్పటిలాగే ప్రతి ఏటా వేట నిషేధిత సమయంలో నిబంధనలు అతిక్రమించిన మత్స్యకారులకు ఏపీ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం సెక్షన్ 4 ప్రకారం శిక్ష తప్పదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అతిక్రమించిన బోట్లును స్వాధీ నం చేసుకోవడంతోపాటు జరిమానా విధించి, ప్రభుత్వం తరపున ఇస్తున్న అన్ని రకాల రాయితీలు రద్దు చేస్తామని రాష్ట్ర మత్స్యశాఖ నుంచి ఆదేశాలు లేకపోలేదు. చేపలు పునరుత్పత్తి సమయంలో మరబోట్లు, యంత్రీకరణ పడవలు తిరగడం వల్ల మత్స్య సంపద నశించిపోతుంది. కనుక నిషేధిత సమయంలో వేట పూర్తిగా నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
కఠిన చర్యలు
నెల్లూరు(వేదాయపాళెం): నిషేధ సమయంలో వేట చేస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలోని వాకాడు, కోట, చిల్లకూరు, టీపీగూడూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, విడవలూరు, అల్లూరు, బోగోలు, కావలి మండలాల పరిధిలోని తీరప్రాంతంలో చేపల వేట నిషేధం ఉంటుంది. ఎవరైనా వేట చేస్తూ పట్టుబడితే రూ.5,000 నుంచి పట్టుబడిన సరుకు విలువకు ఐదు రెట్లు జరిమానా విధిస్తారు. సమస్య తీవ్రతను బట్టి ఒక్కోసారి బోటు లైసెన్స్ రద్దు చేస్తారు. చేతులు, తెడ్ల సాయంతో నడిపే చిన్న పడవలకు చేపలవేటకు మినహాయింపునిచ్చారు.
సముద్ర తీరం : 175 కిలోమీటర్లు
తీర ప్రాంత మండలాలు : 12
మత్స్యకార గ్రామాలు : 92
జనాభా : 89,640 మంది
వేటపై ఆధారపడిన
మత్స్యకార కుటుంబాలు : 7,197
వారికి ఉన్న బోట్లు : 4,870
ఏడాదంతా గాలించినా
దొరకని మత్స్య సంపద
రెండు దఫాలుగా అందని
వేట విరామ నగదు
నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో..


