నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 144మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వినతులను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ సత్యనారాయణ, డీసీఆర్‌బీ, మహిళా పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, ఎన్.రామారావు తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● నా భర్త, అత్తమామలు రూ.15 లక్షలు అదనపుకట్నం తీసుకురమ్మని ఇంటి నుంచి గెంటేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత కోరారు.
● నా భర్త లక్ష్మణ్ గతనెల 9వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. త్వరితగతిన నా భర్త ఆచూకీ కనుక్కుని అప్పగించాలని ఆత్మకూరు ప్రాంతానికి చెందిన ఓ వివాహిత కోరారు.
● నా పేరుపైనున్న ఇంటిని తన పేరుపై రాయమని రెండో కుమారుడు వేధిస్తున్నాడు. అతని బారి నుంచి రక్షణ కల్పించాలని కావలి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు.


