మండల మీట్‌లో తమ్ముళ్ల తిష్ట
● సర్వసభ్య సమావేశం అభాసుపాలు
● ప్రజాప్రతినిధుల కుర్చీల్లో టీడీపీ నేతలు
● ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిబంధనలకు తూట్లు
ఉలవపాడు: మండల సర్వసభ్య సమావేశాలను ప్రజా సమస్యలను చర్చించడం కోసం ఏర్పాటు చేస్తారు. కేవలం ప్రజాప్రతినిధులు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు మాత్రమే హాజరుకావాలి. కానీ శుక్రవారం ఉలవపాడులో జరిగింది చూసి టీడీపీ కార్యకర్తల సమావేశంలా మార్చేశారని ప్రజలు చర్చించుకున్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమైంది. దీనికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన సీట్లలో టీడీపీ నాయకులు కూర్చొన్నారు. కోరం కోసం సంతకం పెట్టి ఎక్కువ శాతం ప్రజాప్రతినిధులు వెళ్లిపోయారు. కేవలం 30 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు అడగాల్సిన సమస్యలను ఎవరు అడుగుతున్నారో, ఎందుకు అడుగుతున్నారో అర్థం కాక, ఏమీ చేయలేక అధికారులు తలలు పట్టుకున్నారు. సమీక్షలు జరపడం పక్కనపెట్టి కేవలం తమ శాఖలకు సంబంధించి కొంత సమాచారం చెప్పడం.. వెళ్లిపోవడం జరిగింది. టీడీపీ నాయకులు ఏకంగా మైక్ తీసుకుని సమావేశంలో మాట్లాడారు. ఇంత దారుణంగా సమావేశం జరగడం ఎప్పుడూ లేదని కొందరు సభ్యులు తెలిపారు.
పట్టించుకోకుండా..
గతంలో కొందరు సర్పంచ్‌ల భర్తలు వచ్చినప్పుడు నాటి ఎమ్మెల్యేలు మీరు రాకూడదని సున్నితంగా తెలియజేసి బయటకు పంపించిన సందర్భాలున్నాయి. కానీ శుక్రవారం తమ పార్టీ నాయకులు నేరుగా వచ్చి కూర్చొన్నా ఎమ్మెల్యే ఇంటూరి కనీసం పట్టించుకోలేదు. అధికారులు చెప్పినా వినేవారు లేరు. టీడీపీ నాయకులు కావడంతో అధికారులు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. సమావేశం నిబంధనలు అసలు ఎమ్మెల్యేకు తెలుసా అని కొందరు చర్చించుకున్నారు. ఎంపీడీఓ సురేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు.
మండల మీట్‌లో తమ్ముళ్ల తిష్ట


