జిల్లా పరిషత్‌లో ఉద్యోగోన్నతులు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న సీనియర్ సహాయకులకు పరిపాలన అధికారులుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ చర్యలు చేపట్టారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో పదోన్నతులు, కారుణ్య నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ మోహన్‌రావు అందజేశారు. ఐదుగురు సీనియర్ సహాయకులకు పరిపాలన అధికారులుగా ఉద్యోగోన్నతులు, నలుగురికి కారుణ్య నియామకాల ద్వారా ఆఫీస్ సబార్డినేట్లుగా ఉద్యోగావకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ 2021 నుంచి ఇప్పటి వరకు 98 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం కల్పించామన్నారు. జెడ్పీ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న 160 మందికి పదోన్నతులు ఇచ్చామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ అధికారులు పాల్గొన్నారు.


