మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
● కోటి సంతకాల సేకరణ
కార్యక్రమంలో బుర్రా
కందుకూరు: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని కూటమి పాలకులు తీసుకున్న నిర్ణయం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వలేటివారిపాళెం మండలంలోని అయ్యవారిపల్లె గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రైవేటీకరణ విషయంలో ప్రజల్లో వచ్చిన ఆగ్రహాన్ని కోటి సంతకాల రూపంలో సేకరించి గవర్నర్‌కు అందజేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా కుంటుపడిందని బుర్రా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పూర్తిగా అవినీతి కార్యకలాపాల్లో కూరుకుపోయారని విమర్శించారు. రేషన్ బియ్యం దందా, ఇసుక, మట్టి మాఫియా, నకిలీ మద్యం, పేకాట శిబిరాలు వంటివి యథేచ్ఛగా నిర్వహిస్తూ తన అనుచరుల ద్వారా కమీషన్ దండుకునేందుకు సరిపోతుందని, పాలనను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. ఇటువంటి పాలకులకు భవిష్యత్‌లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. భారీగా హాజరైన ప్రజల నుంచి ఆయన సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డేగా వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు చింతలపూడి రవీంద్ర, చౌడబోయిన యానాది, రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కట్టా హనుమంతరావు, మండల మహిళా అధ్యక్షురాలు వంకదారి కామేశ్వరి, గుత్తా గోపీ, పొట్టేళ్ల కృష్ణయ్య, ఇరపని అంజయ్య, ప్రగడ రవి, బచ్చు తిరుపాలు, రూపినేని వెంకటేశ్వర్లు, బచ్చు శ్రీనివాసరావు, ముతకని ఏడుకొండలు, గుర్రం పున్నయ్య, టెంకం ప్రసాద్, టెంకం కొండలరావు తదితులు పాల్గొన్నారు.


