
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు (అర్బన్): భవిష్యత్ తరాల మనుగడకు ఆడ బిడ్డలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హిమాన్షుశుక్లా అన్నారు. అంతర్జాతీయ బాలికాదినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఐసీడీఎస్, వైద్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళా ఉద్యోగులతో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల వద్ద కలెక్టర్ హిమాన్షు శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ కేవీఆర్ పెట్రోల్ బంకు మీదుగా ట్రంకు రోడ్డులో కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ బిడ్డలను పుట్టినప్పటి నుంచే ఆడైనా.. మగైనా సమానమే అనే భావంతో పెంచాలన్నారు. స్కానింగ్ ద్వారా ఆడబిడ్డ అని తెలుసుకుని అబార్షన్ చేయించి బ్రూణ హత్యలకు పాల్పడం అమానుషమన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ చేసినట్టు తేలితే అలాంటి డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపటి తరాల ఆశాజ్యోతి, ఇంటికి కానుక, వెలుగు ఆడ పిల్ల అన్నారు. ఆడ బిడ్డ చదువుకుంటే కుటుంబంతో పాటు సమాజం ఎంతో వృద్ధి చెందుతుందన్నారు. మహిళలు మగ వారితో సమానంగా అన్ని పనులు చేస్తున్నారన్నారు. ఆమె ఔన్నత్యం గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, డీఎంహెచ్‌ఓ సుజాత, బాలల సంరక్షణ అధికారి సురేష్, ఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి వరప్రసాద్, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖల సిబ్బంది, విద్యార్ధినిలు పాల్గొన్నారు.
మహిళా ఉద్యోగులు, విద్యార్థినులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న హిమాన్షు శుక్లా
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా

లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు