
ఉద్యమాలకు ఉద్యోగులు సిద్ధం కావాలి
● డివిజన్ స్థాయిలో
సంఘాల బలోపేతం
● ఏపీ జేఏసీ అమరావతి
రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు
నెల్లూరు(అర్బన్): ‘ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు. ఉద్యోగులు తమ హక్కులు సాధించుకునేందుకు ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి’ అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. జేఏసీలో భాగస్వామ్య పక్షాలైన వివిధ ప్రభుత్వ శాఖల అసోసియేషన్ నాయకులు, రాష్ట్ర నాయకులతో కలిసి శుక్రవారం నెల్లూరు దర్గామిట్టలోని నెల్లూరు క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో బొప్పరాజు పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన పెండింగ్ బకాయిలు, ఇతర సౌకర్యాలు సాధించుకునేందుకు మరోమారు అందరిని కలుపుకొని పోరాటం చేయాలన్నారు. పోలీసుల సమస్యలనే ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారితోపాటు అన్ని శాఖల ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు, ఆర్జిత సెలవుల నగదు, పెన్షన్ నగదు తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పోరాటాలు చేయాలంటే తమ, తమ విభాగాల్లో డివిజన్ స్థాయిలో సంఘాలను బలోపేతం చేసుకోవాలన్నారు. ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలు గురించి చర్చించాలన్నారు. ఉద్యమంలో మహిళలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. మహిళలకు ప్రసూతి సెలవుల్ని కేంద్ర ప్రభుత్వంమాదిరిగా రెండు సంవత్సరాలకు పెంచాలని కోరామన్నారు. మరోవైపు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయించేందుకు పోరాట ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉమ్మడి 12 జిల్లాల్లో జేఏసీ సమావేశాలు పూర్తి చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో కూడా సమావేశం పూర్తి చేసి అనంతరం భాగస్వామ్య పక్షాలతో కలిసి ఉద్యమ ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు.
● వివిధ శాఖలకు చెందిన అసోసియేషన్ల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును నిరసించారు. ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసులు, వెటర్నరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌రెడ్డి, ఫైర్ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్ర, పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాబూరావు, క్లాస్ – 4 అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, వార్డు సచివాలయ అధ్యక్షుడు థామస్, హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెంచురామయ్య, ఏపీ జేఏసీ మహిళా వింగ్ చైర్మన్ సోమిశెట్టి వసంతకుమారి, ప్రధాన కార్యదర్శి చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.