
నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం
● ఘనంగా గురుపూజోత్సవం
నెల్లూరు రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ రానున్న ఐదు, పది సంవత్సరాల కాలంలో విద్యావ్యవస్థలో వచ్చే మార్పుల్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు శిక్షణ పొందాలన్నారు. జిల్లాలో ఎంపీఎస్ (మోడల్ ప్రైమరీ స్కూల్) వ్యవస్థను విజయవంతంగా నడిపించే బాధ్యత ఉపాధ్యాయులేదేనన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సమన్వయంతో పనిచేస్తే విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావొచ్చన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత మర్చిపోలేని వ్యక్తులు గురువులే అన్నారు. డీఈఓ డాక్టర్ బాలాజీరావు మాట్లాడుతూ జిల్లాలో 15 మంది స్కూల్ అసిస్టెంట్లు 25 మంది ఎస్జీటీలు, ఇద్దరు స్కౌట్ టీచర్లలను అవార్డులతో సత్కరించామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, డీఆర్వో విజయకుమార్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సమగ్ర శిక్ష అధికారి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.