
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
● బాణసంచా పేలుడుతో ప్రమాదం
కోవూరు: పట్టణంలోని సత్రం వీధికి చెందిన గణేష్ నిమజ్జన ఊరేగింపులో గురువారం రాత్రి అపశ్రుతి చోటు చేసుకుంది. లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనం ఊరేగింపు ముందు వెళ్తోంది. అందులో జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. ఉత్సవం సందర్భంగా బాణసంచా కాల్చారు. దీంతో నిప్పురవ్వలు స్టిక్స్‌పై పడి పేలిపోయాయి. బ్యాటరీ వాహనానికి మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సమీపంలో ఉన్న సాయిబాబా మెడికల్ షాప్ యజమాని బ్రహ్మయ్య భార్య లక్ష్మి (45) తీవ్రంగా గాయపడగా వెంటనే ఆమెను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. అదేవిధంగా అక్కడే ఉన్న రాందేవ్‌బాబా (20) అనే యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై రంగనాథ్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఉత్సవ కమిటీలోని ఐదుగురిపై కేసు నమోదు చేశారు. పేలుడు వల్ల సమీపంలో ఉన్న భవనాలు దెబ్బతిన్నాయి.
● కొండ ప్రాంతాల్లో రాళ్లు పేల్చడానికి వాడే జిలెటిన్ స్టిక్స్ వెలుగు చూడటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఉత్సవాల సమయంలో భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విమర్శలున్నారు. గాయపడిన మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కోవూరులో ఉద్రిక్తత నెలకొంది.