రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
ఆత్మకూరు: పట్టణ పరిధిలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారి ఎన్‌హెచ్ – 67పై రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు – ముంబై రహదారి నుంచి ఏఎస్‌పేట వెళ్లే అడ్డ రోడ్డు ఆర్చి వద్ద ప్రమాదాలు జరిగిన స్థలాన్ని అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. 20 రోజుల వ్యవధిలో ఒకే ప్రాంతంలో మూడు ప్రమాదాలు సంభవించి, ముగ్గురు మృతి చెందడం బాధాకరమని చెప్పారు. అనంతరం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తించిన ప్రాంతంలో వాహనాల వేగాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో రూ.ఐదు కోట్ల ఆదాయం దాటిన ప్రధానాలయాల్లో భక్తులకు అన్నప్రసాదాన్ని నాణ్యత ప్రమాణాలతో అందించేలా చర్యలు చేపట్టామని వివరించారు. కామన్ గుడ్ ఫండ్ ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులను ఆలయాల మరమ్మతులు, పునర్నిర్మాణాలకు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. ఆర్డీఓ పావని, డీటీసీ చందర్, ఎన్‌హెచ్ డిప్యూటీ మేనేజర్ సుదాన్ష్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, తహసీల్దార్ పద్మజాకుమారి, ఆర్ అండ్ బీ ఈఈ, ఏఈలు మురళీకృష్ణ, అమానుల్లాఖాన్, ఇరిగేషన్ ఈఈ రవి, ఏఈ రవికుమార్, డీఎస్పీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


