
ఏంటి.. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయా?
ఉలవపాడు: ఏడాదికొకసారి జరిగే ఉలవపాడులోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది భక్తులకు కనీస సమాచారం లేదు. రథోత్సవం లేదని, ఆ స్థానంలో పూల రథోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. అయి తే దేవస్థాన మైక్ ద్వారా, దండోరా ద్వారా కానీ తెలియచేయని దుస్థితి. ఈ ఏడాది అంతా రహస్యమే. బహిరంగ పోస్టర్లు లేవు. కర పత్రాలు ఎన్ని కొట్టించారో, ఎవరికి పంపిణీ చేశారో తెలియదు. ఇలా దేవదాయ శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉత్సవాలు జరుగుతున్నాయని గుడి దగ్గర పందిరి చూస్తే తప్ప తెలియని పరిస్థితి నెలకొంది.
నచ్చిన సమయంలో వచ్చి..
దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా సుమా రు ఆరునెలల క్రితం వెలగం శ్రీనివాస్‌ను నియమించారు. ఈయన ఒంగోలులో నివాసం ఉంటారు. తనకు నచ్చిన సమయంలో గుడి వద్దకొచ్చి సిబ్బందిని పిలిచి నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం ఉంది. ఆయన వచ్చే సమయం చెప్తారని, ఆ సమయంలోనే బ్రహ్మోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వారు వేచి ఉండాలని చెబుతున్నారు. మళ్లీ వచ్చినప్పుడే మిగిలిన నిర్ణయాలు జరుగుతాయి. రాజకీయ నాయకులకు చెప్తే చాలు, భక్తులకు అవసరం లేదనే విధంగా ఉన్నారని ఆరోపణలున్నాయి.
నామమాత్రంగా..
గతంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పోస్టర్లు అంటించేవారు. ఈ ఏడాది అలా జరగలేదు. ప్రజాప్రతినిధులను కూడా పట్టించుకోలేదు. గతంలో దాదాపు 8 సాంస్కృతిక కార్యక్రమాలు జరిపేవారు. ఈ ఏడాది ఐదుతో సరిపెట్టారు. నాడు బస్టాండ్ సెంటర్‌లో కూడా విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈసారి అవి లేవు. ఉన్న కార్యక్రమాలు కూడా భక్తులకు తెలియని పరిస్థితి.
కార్యక్రమాలిలా..
బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 9 గంటలకు అంకురార్పణ, 8న ధ్వజారోహణ, చప్పరసేవ, 9న హంస వాహనం, 10న సింహ వాహనం, 11న హనుమంతసేవ, 12న గరుడసేవ, 13న ఏనుగుసేవ, 14న కల్యాణం, పూల రథోత్సవం, 15న దొంగలదోపు తదితర కార్యక్రమాలు 17 వరకు జరుగుతాయి. 11 ,12, 13, 14 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
నేటి నుంచి వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు
పోస్టర్లు, కరపత్రాలెక్కడ?
దేవదాయ శాఖ నిర్లక్ష్యం

ఏంటి.. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయా?