
ఎంప్లాయీమెంట్ రిటర్న్స్ సమర్పించండి
నెల్లూరురూరల్: పబ్లిక్, ప్రైవేట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఎంప్లాయీమెంట్ రిటర్న్స్ www. employment. ap. gov. in employer login ద్వారా సమర్పించాలని జిల్లా ఉపాధి శాఖ అధికారి వినయ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి తెలియజేయాల్సి ఉందన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే సెల్ నంబరు 9642653931లో కాని, జిల్లా ఉపాధి శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని తెలిపారు.
డీసీపల్లిలో 555 పొగాకు
బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 555 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 779 బేళ్లు రాగా 555 బేళ్లు విక్రయించామన్నారు. మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 71,546.9 కిలోల పొగాకు విక్రయించగా రూ.1,79,61,586.20 వ్యాపా రం జరిగింది. కిలో గరిష్ట ధర రూ.280 కాగా, కనిష్ట ధర రూ.210 లభించింది. సగటు ధర రూ.251.05 నమోదైంది. వేలంలో 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
● కలిగిరి: కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్ క్లస్టర్ రైతులు 327 బేళ్లను అమ్మకానికి తీసుకు రాగా 282 పొగాకు బేళ్లను కొనుగోలు చేయగా వివిధ కారణాలతో 45 బేళ్లను కొనుగోలుకు తిరస్కరించారు. వేలం నిర్వహణాధికారి టి. ఇషాక్‌స్వర్ణదత్ మాట్లాడుతూ కనిష్ట ధర రూ.210 పలకగా, సగటు ధర రూ.254.39 లభించిందన్నారు. వేలంలో 15 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.
నీటి విడుదల
ప్రక్రియ వాయిదా
సోమశిల: ఐఏబీ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం సోమశిల జలాశయం ద్వారా సోమవారం నుంచి నీరు విడుదల చేయాల్సి ఉంది. అయితే సంబంధిత ఉన్నతాధికారుల నుంచి ఇండెంట్ రాకపోవడంతో నీటిని విడుదల చేయలేదని, బుధవారం డెల్టాకు నీటిని విడుదల చేస్తామని, ఉత్తర, దక్షిణ కాలువలకు మాత్రం ఇండెంట్ వచ్చినప్పుడు విడుదల చేస్తామని జలాశయం ఈఈ శ్రీనివాస్ తెలిపారు.
జిల్లా జైల్లో ఖైదీ
ఆత్మహత్యాయత్నం వైరల్
వెంకటాచలం: మండలంలోని చెముడుగుంట వద్ద ఉన్న జిల్లా జైల్లో ఓ ఖైదీ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖైదీలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జీఓ నంబరు 58 బదులు జీఓ నంబరు 71 అమలు చేయడమే దీనికి కారణమని సమాచారమని విస్తృతంగా వైరల్ కావడంతో అధికార యంత్రాంగం ఉలికిపడింది. ఈ విషయమై జైలు అధికారులను సంప్రదించగా అలాంటి ఘటన జైల్లో జరగలేదని చెబుతున్నారు.
సమ్మె ఆపే ప్రసక్తే లేదు
నెల్లూరు (అర్బన్): తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను ఆపే ప్రసక్తే లేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భానుమహేష్ తెలిపారు. పెండింగ్ బకాయిలు, ఇన్‌సెంటివ్స్ చెల్లించాలని, వేతన సవరణ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ సీహెచ్‌ఓలు గత 9 రోజులుగా విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మూసేసి జిల్లా వైద్యశాఖ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్నారు. సోమవారం భానుమహేష్ మాట్లాడుతూ తాము ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరలేదన్నారు. ఆరేళ్లుగా జీతం పెంచలేదన్నారు. రెండు ఏళ్లుగా చెల్లించాల్సిన బకాయిలు, ఇన్‌సెంటివ్స్ ఇవ్వకుండా కొత్తగా ఇప్పుడు సీహెచ్‌ఓలు చేసే పని ఆధారంగానే ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమన్నారు. మా ఆవేదన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే తాము సమ్మెలోకి వెళ్లామన్నారు. తమ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సీహెచ్‌ఓల పేరుతో కొత్త సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి తాము ఇతరులను దూషించినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని తాము సైబర్ క్రైమ్ కింద డీఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఆదిల్, రెబకా పలువురు సీహెచ్‌ఓలు పాల్గొన్నారు.