
విద్యార్థులకు ‘నీట్’ కష్టాలు
నెల్లూరు (టౌన్): ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ – 2025 విద్యార్థులకు చుక్కలు చూపెట్టింది. ఆదివారం నెల్లూరు నగరంలోని 10 సెంటర్లలో పరీక్షను నిర్వహించారు. జిల్లాలోని నలుమూలల నుంచి 2,913 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2,852 మంది హాజరయ్యారు. 61 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగింది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అనుమతించలేదు. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత గాలివాన రావడంతో నగరంలోని దాదాపు అన్ని సెంటర్లలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆయా కేంద్రాల్లో గంటకు పైగా సరఫరా నిలిచిపోయింది. జనరేటర్లు, ఇన్వర్టర్లు లేకపోవడంతో విద్యార్థులు సరైన గాలి, వెలుతురు లేక ఇబ్బందులు పడ్డారు. గతంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షను నిర్వహించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా జనరేటర్ ద్వారా తక్షణమే పునరుద్ధరించే అవకాశం ఉండింది. ప్రధానంగా ఈసారి చీకటి గదుల్లో పరీక్షల నిర్వహించడంతో విద్యార్థులు సక్రమంగా రాయలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక సెంటర్‌లోకి వచ్చిన వెంటనే సంబంధిత విద్యార్థితో సదరు వేలిముద్ర వేయించాల్సి ఉంది. అయితే చాలాచోట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహించారు. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులతో వేలిముద్ర వేయించారు. ఈ క్రమంలో గంటల తరబడి అసౌకర్యానికి గురయ్యారు. నీట్ నిర్వాహకులు సరైన వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులతోపాటు వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అవస్థలు ఎదుర్కొన్నారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన వారు తిరిగి వచ్చేంత వరకు కేంద్రాల వద్దే పడిగాపులు కాశారు.
ఆల్ ది బెస్ట్ చెబుతూ..
పరీక్ష మధ్యలో విద్యుత్ సరఫరాకు
అంతరాయం
సరైన వెలుతురు, గాలి లేక
ఇబ్బందులు
కొన్ని కేంద్రాల్లో పరీక్ష ముగిసిన తర్వాత వేలిముద్ర

విద్యార్థులకు ‘నీట్’ కష్టాలు

విద్యార్థులకు ‘నీట్’ కష్టాలు

విద్యార్థులకు ‘నీట్’ కష్టాలు