
కీలకమైన రికార్డులు.. అధికారి ఇంటికా..?
కొడవలూరు: డీసీఎమ్మెస్‌లోని కీలకమైన మినిట్స్ బుక్, డే బుక్, లెడ్జర్లు.. డివిజనల్ కోఆపరేటివ్ అధికారి సుధాభారతి ఇంటికి మార్కెటింగ్ మేనేజర్ ద్వారా బుధవారం వెళ్లాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు ఆరోపించారు. నార్తురాజుపాళెంలోని తన అతిథిగృహ ప్రాంగణంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. రికార్డులను అధికారి ఇంటికి తీసుకెళ్తుండగా, మార్కెటింగ్ మేనేజర్ రవికుమార్‌ను ఓ విలేకరి ప్రశ్నించారని, దీంతో ఆయన తడుముకుంటూ తాను కొత్తగా వచ్చానని, అధికారి సూచనల మేరకే తీసుకెళ్లానని చెప్పారన్నారు. సీసీ పుటేజీల్లో చూసినా ఇదే విషయం బహిర్గతమవుతుందని చెప్పారు. డీసీఎమ్మెస్‌కు పర్సన్ ఇన్‌చార్జిగా జేసీ ఉన్నారని, ఆయనకు తెలియకుండా రికార్డులను అధికారి ఇంటికి తీసుకెళ్లడం దారుణమని చెప్పారు. అందులో దేన్ని మార్చేందుకు తీసుకెళ్లారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సదరు అధికారిపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలున్నాయని చెప్పారు. డీసీఎమ్మెస్ మార్కెటింగ్ మేనేజర్‌గా ఆమె ఉన్న సమయంలో సంస్థ రైస్ మిల్లును తన భర్తకు అప్పగించిన అంశాన్ని ప్రస్తావించారు. మిల్లులో అవకతవకలు జరిగి మెషినరీ పనికిరాకుండా పోయిందని చెప్పారు. డీసీఎమ్మెస్‌కు చెందిన బాణసంచా, పుస్తకాలు, వేప పిండి వ్యాపారంలోనూ రూ.నాలుగు లక్షలను స్వాహా చేశారని ఆరోపించారు. ఐసీడీఎస్ పీడీగా నియమించగా, అందులోనూ భారీ అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. ఆమె తీరే ఇంతని, మరో రెండు నెలల్లో రిటైరవ్వనున్నారని తెలిపారు. ఆమె అవినీతి బాగోతంపై విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ జ్యోతి, సర్పంచ్ సుప్రియ, పార్టీ మండలాధ్యక్షుడు చిమటా శేషగిరిరావు, నేతలు కొండా శ్రీనివాసులురెడ్డి, మాణిక్యరావు, అనపల్లి ఉదయ్‌భాస్కర్, జడ్డా సాయికుమార్, గాలి సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.