
టైర్లు కొనలేక బెంబేలు..
అన్నింట్లో మోతే..
●
టైరు ధర మూడేళ్ల క్రితం రూ.16 వేలుంటే, ప్రస్తుతం అది రూ.21,500కు చేరింది. రేడియల్ టైర్లు ఒక్కొక్కటి రూ.22 వేలు ఉంటే, రూ.26 వేలకు ఎగబాకాయి. ఇంజిన్ ఆయిల్‌తో పాటు విడిభాగాల ధరలను 20 శాతం మేర పెంచారు. లారీని బట్టి నిర్వహణ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. అన్ని పత్రాలున్నా పోలీస్, రవాణా అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పందే అక్కడి నుంచి పంపే పరిస్థితి లేదు.
● పెరిగిన ఇన్సురెన్స్, టైర్లు, విడి భాగాల ధరలు ఈ రంగాన్ని కకావికలం చేస్తున్నాయి.
● లారీ, దాని విలువ బట్టి థర్ట్ పార్టీ ఇన్సురెన్స్ రెండేళ్ల క్రితం రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉండేది. ప్రస్తుతం ఇది రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు ఎగబాకింది.
● 22 చక్రాల కొత్త లారీకి ఇన్సురెన్స్ రూ.1.25 లక్షల వరకు ఉంది.
● లారీని బట్టి త్రైమాసిక పన్ను రూ.8 వేల నుంచి రూ.14 వేల వరకు ఉంది.
● నేషనల్ పర్మిట్‌కు రూ.17 వేలు అదనం.
● ఏడేళ్లు దాటిన రవాణా వాహనానికి ఏటా గ్రీన్ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది.
నెల్లూరు(టౌన్): లారీ ఉందంటేనే అదో ఠీవి. అబ్బో యజమానా.. ఇంకేమిలే అనే మాట తరచూ వినిపించేది. అయితే ఇదంతా గతం. రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ రంగం ప్రస్తుతం కకావికలమవుతోంది. డీజిల్ ధర లీటర్ రూ.98కి చేరువలో ఉండటం.. జాతీయ రహదారిపై ప్రతి 50 కిలోమీటర్లకో టోల్‌గేట్.. జీఎస్టీ మోతతో ఆదాయం సంగతి దేవుడెరుగు.. కనీస ఖర్చులొస్తే చాలు మహాప్రభో అనే స్థితికి యజమానులు వస్తున్నారు.
అప్పటికీ.. ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం
గతంలో ఉమ్మడి జిల్లాలో 30 వేలకుపైగా లారీలు ఉండేవి. ప్రధానంగా కృష్ణపట్నం పోర్టుకు ఎగుమతులు, దిగుమతులు అధిక సంఖ్యలో జరిగేవి. దీంతో పాటు ఇసుక, సిలికా, క్వార్ట్‌జ్, ధాన్యం, బియ్యం తదితరాల్లో వీటి పాత్ర కీలకం. లాభాలెక్కువగా ఉండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపేవారు. అయితే కాలక్రమంలో ఇది పతనావస్థకు చేరుతోంది. కొత్తగా కొనుగోలు చేసే వారి సంగతి అటుంచితే.. ఉన్నవి కాపాడుకోవడమే గగనంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో లారీల సంఖ్య పది వేల్లోపే ఉంటాయని సమాచారం.
కాలం మారింది.. కిరాయే మారలేదు
రవాణా రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా ఐదేళ్లుగా ఉన్న కిరాయే నేటికీ కొనసాగుతోంది. లోడింగూ అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు సరుకుల రవాణాకు ఇటీవలి కాలంలో రైళ్లను ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. రాబడి తగ్గి.. ఖర్చులు అమాంతం పెరగడంతో కొందరు యజమానులు తమ లారీలను విక్రయానికి పెట్టారంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు బయటకొచ్చి ఏ వ్యాపారం చేయలేక అందులోనే కాలం వెళ్లదీస్తున్నారు.
డ్రైవర్లేరీ..?
రవాణా రంగ సంక్షోభానికి డ్రైవర్ల కొరతా ఓ కారణమవుతోంది. కొత్తగా ఇందులోకి వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. పైగా వీరికిచ్చే కమీషన్‌ను పది శాతానికి పెంచారు. ఉదాహరణకు కిరాయి రూ.లక్ష ఉంటే అందులో రూ.పది వేలను డ్రైవర్‌కు ఇవ్వాల్సిందే. లోడింగ్, అన్ లోడింగ్ బాధ్యతను యజమానే భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ మేరకు కిరాయి వస్తే అన్ని ఖర్చులు పోనూ రూ.20 వేలు కూడా మిగలని పరిస్థితి నెలకొంది.

టైర్లు కొనలేక బెంబేలు..