భూమి మా ప్రాణం.. జీవనాధారం | - | Sakshi
Sakshi News home page

భూమి మా ప్రాణం.. జీవనాధారం

Mar 18 2025 12:08 AM | Updated on Mar 18 2025 12:08 AM

భూమి మా ప్రాణం.. జీవనాధారం

భూమి మా ప్రాణం.. జీవనాధారం

కావలి: మూడు పంటలు పండే మా భూములు మా ప్రాణం, మా జీవనాధారం. అటువంటి భూములను బలవంతంగా లాక్కుంటామంటే ఊరుకునేది లేదని, అధికారులు మొండిగా వ్యవహరిస్తే.. సామూహిక ఆత్మహత్యలకు కూడా వెనుకాడేది లేదని మండలంలోని తీర ప్రాంతాల రైతులు తెగేసి చెప్పారు. మండలంలోని ఆనెమడుగు, మొండిదిన్నెపాళెం కట్టకిందపాళెం, బైనేటివారిపాళెం, ఆకుతోట గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, గీత కార్మికులు, గ్రామాల్లో ప్రజలు తమ అభిప్రాయాలు తీసుకోకుండా భూము లు లాక్కోవాలని 91 డిక్లరేషన్‌ ప్రకటించడంపై రైతులు నిరసన నినాదాలతో హోరెత్తించారు. రైతుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా, ఏడాదికి మూడు పంటలు పండే భూములను పరిశ్రమలకు ఎలా కేటాయిస్తారంటూ వందలాది మంది రైతులు సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్డీఓకు, అధి కారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. రైతులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అధికారుల వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్తల కోసం కావలి తీరంలో భూములు సేకరించడం దారుణమన్నారు. ఈ భూములపై ఆధారపడి ఐదు గ్రామాల ప్రజలు జీవ నం సాగిస్తున్నారని తెలిపారు. అధికారులు వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఈ నెల 25 నుంచి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సామూహికంగా ఆత్మహత్యలకై నా సిద్ధమే కానీ ఒక్క సెంటు భూమి కూడా వదులుకోమని తెలిపారు. దీంతో ఆర్డీఓ వంశీకృష్ణ బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు తెలియజేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కావలికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామాల్లో సంవత్సరానికి మూడు పంటలు పండే భూముల మీద 1,200 కుటుంబాలు, 400 కల్లుగీత కుటుంబాలు, 300 పాడి రైతు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. 2013 భూసేకరణ చట్టప్రకారం బహుళ పంటలు పండే భూములు తీసుకోకూడదని చెప్పారు. గ్రామ సభలో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలని, 80 శాతం ఆమోదం పొందాలని చట్టంలో ఉన్నా అధికారులు ఆ చట్టాన్ని తుంగలో తొక్కారని తెలిపారు. ప్రజలు చూడని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి భూములు లాక్కోవాలని చూడడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో వ్యవసా య కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగళ పుల్లయ్య, జిల్లా అధ్యక్షుడు జొన్నలగడ్డ వెంకమ్మరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్లూరు మాల్యాద్రి, మండల కార్యదర్శి రాధాకృష్ణయ్య, రైతు సంఘం నాయకులు గడ్డం మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తుమ్మల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

భూములు లాక్కుంటే ఆత్మహత్యలే

మూడు పంటలు పండే భూములు

పరిశ్రమలకు ఇవ్వం

ఈ నెల 25 నుంచి నిరవధిక

నిరాహార దీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement