ఇటీవల జరిగిన ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

ఇటీవల జరిగిన ప్రమాదాలు

Mar 10 2025 12:07 AM | Updated on Mar 10 2025 12:07 AM

ఇటీవల

ఇటీవల జరిగిన ప్రమాదాలు

అభివృద్ధికి చిహ్నాలైన రహదారులు నెత్తురోడుతున్నాయి. సవ్యంగా లేని రోడ్లు.. వాహనాలను నిర్లక్ష్యంగా నడిపే చోదకులు.. భద్రత నిబంధనలపై అవగాహలేమి.. కారణాలేమైతేనేం రుధిరదారులుగా మారుతున్నాయి. ఆనందంగా సాగిపోతున్న ప్రయాణాల్లో అంతలోనే అంతులేని విషాదం కమ్మేస్తోంది. కన్నవారిని, కడుపున పుట్టిన వారిని కోల్పోయిన కుటుంబాలు కుమిలిపోతున్నాయి. ఎంతోమంది శాశ్వత వైకల్యం బారిన పడి జీవితాంతం బాధపడుతున్నారు. 68 రోజుల వ్యవధిలో 44 మందికిపైగా మృతి చెందారంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

నెల్లూరు(క్రైమ్‌): రోడ్లెక్కాక ఇంటికి క్షేమంగా చేరుతామో.. లేమోననే మీమాంసలో వాహనచోదకులున్నారు. జిల్లా పరిధిలోని రోడ్లపై నిరంతరం ప్రమాదాలు చోటుచేసుకుంటూ.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. మితిమీరిన వేగం.. ఓవర్‌టేకింగ్‌.. అకస్మాత్తుగా వాహనాలను నిలపడం.. నిద్ర లేమి.. మద్యం మత్తు.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌.. ట్రాఫిక్‌ నిబంధనల అతిక్రమణ.. పరిమితికి మించి ప్రయాణం.. రాంగ్‌రూట్‌లో రాకపోకలు.. ఇలా ప్రమాదాలకు కారణాలెన్నో. కొన్ని సందర్భాల్లో గమ్యస్థానానికి సకాలంలో చేరాలనో.. అందరి కంటే ముందుగా వాహనాన్ని చేర్చాలనో.. అత్యవసర పనో.. మరో బాడుగ ఉందనో వాహనాలను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు.

అంతా అస్తవ్యస్తం..

జాతీయ, రాష్ట్ర రహదారులు కొంతవరకు బాగానే ఉన్నా.. జిల్లా, మండల, గ్రామీణ రహదారులు గుంతలు పడి దుర్భరంగా మారాయి. రోడ్లపై నిర్దిష్ట పార్కింగ్‌ ప్రాంతాల్లో కాకుండా ఎక్కడపడితే అక్కడ వాహనాలను ఇష్టారాజ్యంగా నిలుపుతున్నారు. అప్రమత్తం చేసేలా ఇండికేటర్లు, స్టిక్కరింగ్‌తో కూడిన ట్రయాంగిల్‌ గుర్తులనూ వాడకపోవడంతో వెనుకొచ్చే వారికి కనిపించక వేగంగా ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాల ముందు, వెనుకా పసుపు, ఎరుపు రంగులతో రేడియం స్టిక్కర్లున్నా, అధిక శాతం నాసిరకంగా మారాయి. దుమ్మూ, ధూళితో ఉండటంతో చీకట్లో వాహనం ఉందో లేదో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంటోంది.

స్టీరింగ్‌ పడుతున్న క్లీనర్లు

క్లీనర్లు అరకొరా డ్రైవింగ్‌తో వాహనాలను అప్పుడప్పుడూ నడుపుతూ పట్టు కోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి రోజుల తరబడి వాహనాలను నడుపుతూ నిద్రమత్తుకు గురై ప్రమాదాలకు కారకులవుతున్నారు. వీరు ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలనూ బలిగొంటున్నారు.

మొక్కుబడి చర్యలు

జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 54 బ్లాక్‌స్పాట్లను అధికారులు గుర్తించారు. ఇందులో ఉలవనాడు – మనుబోలు (ఎన్‌హెచ్‌ – 16)పై 45.. కృష్ణపట్నం – బద్వేల్‌ (ఎన్‌హెచ్‌ – 67)పై ఏడు.. ఇతర రహదారుల్లో మరికొన్నింటిని కనుగొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇసుక డ్రమ్ములు, బ్యారికేడ్లు, మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, సోలార్‌ విద్యుద్దీపాలు, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని రోడ్డు భద్రత సమావేశాల్లో అధికారులు తీర్మానించారు. కొన్ని ప్రాంతాల్లో మినహా అవి మరెక్కడా కానరావడంలేదు. వేగ నియంత్రణ, బ్లాక్‌ స్పాట్ల వద్ద నిర్దిష్ట చర్యలు, రోడ్డు సేఫ్టీ కమిటీ నిర్ణయాల అమలుపై పోలీస్‌, రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫేస్‌వాష్‌కు బ్రేక్‌..

నిద్రమత్తులో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు వాహన డ్రైవర్లకు ఫేస్‌వాష్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో ప్రమాదాలు తగ్గుముఖం పట్టగా, కాలక్రమంలో ఆ ప్రక్రియకు బ్రేక్‌పడింది.

ప్రమాదంలో దెబ్బతిన్న వాహనం

ఇలా చేస్తే.. కొంత మేలు

జాతీయ రహదారిపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలపకుండా చూడాలి. రాత్రి వేళ వాహనచోదకుడికి ముందు వాహనం ఉందనే విషయాన్ని స్పష్టంగా కనిపించేలా చేయాలి.

వేగ నియంత్రణ, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా చూడాలి. అతివేగంతో దూసుకెళ్లే వాహనాలను నిఘా కెమెరాలతో గుర్తించి వెంటనే కళ్లెం వేయాలి. సంబంధిత వాహన యాజమాని సెల్‌ఫోన్‌కు సందేశం పంపి అప్రమత్తం చేయాలి.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలను నిర్వహించాలి. అనుభవం లేని వారు వాహనాలను నడుపుతుంటే కేసులు నమోదు చేయాలి.

ద్విచక్రవాహనచోదకుడైతే హెల్మెట్‌.. కారులోని వారు సీట్‌ బెల్టును విధిగా ధరించేలా చూడాలి. నిబంధనల ఉల్లంఘనలపై కొరడా ఝళిపించాలి.

ఫేస్‌ వాష్‌ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి.

హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించేలా చూడాలి.

జిల్లా పరిధిలోని రోడ్లపై నిత్యం ప్రమాదాలు

గాల్లో కలుస్తున్న ప్రాణాలు

వీడని నిర్లక్ష్యం.. భద్రతలో అలక్ష్యం

68 రోజుల్లో

44 మందికిపైగా మృత్యువాత

సుందరయ్య కాలనీ సమీపంలోని జాతీయ రహదారిపై కారు మితిమీరిన వేగంతో వస్తూ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొంది. ఘటనలో ఆటోలోని ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇన్నోవా డ్రైవర్‌ నిద్రమత్తులో వాహనాన్ని నడుపుతూ భగత్‌సింగ్‌కాలనీ సమీపంలో డివైడర్‌ను శనివారం తెల్లవారుజామున ఢీకొని.. గూడూరు వైపు వెళ్లే లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో అక్కాతమ్ముడు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు, డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు.

సంగం మండలంలో ఆటోను పల్లెవెలుగు బస్సు జనవరిలో ఢీకొనడంతో వెంకటశేషయ్య, వరలక్ష్మి దంపతులు మృతి చెందారు.

ఇటీవల జరిగిన ప్రమాదాలు 
1
1/2

ఇటీవల జరిగిన ప్రమాదాలు

ఇటీవల జరిగిన ప్రమాదాలు 
2
2/2

ఇటీవల జరిగిన ప్రమాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement