
నెల్లూరులోని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ప్రధాన పరిపాలనా కార్యాలయం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ శాఖ పౌరపట్టిక ప్రకారం నిర్ణీత గడువులోగా వినియోగదారులకు సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ సిబ్బందిపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కొరడా ఝళిపించింది. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఏఈ స్థాయి అధికారి వరకు భారీగా జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని వేతనాల్లో కోత వేసి వినియోగదారులకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్కిల్ పరిధిలో ఆత్మకూరు, గూడూరు, కావలి, నాయుడుపేట, నెల్లూరు రూరల్, నెల్లూరుటౌన్ డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్ల పరిధిలో నూతన సర్వీసులు ఇవ్వడంలో జాప్యం, ప్యూజ్ ఆఫ్ కాల్స్ (విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై వచ్చే ఫిర్యాదులు), విద్యుత్ పనుల అంచనాలో జాప్యం, విద్యుత్‌లైన్లు, స్తంభాల ఏర్పాటు, విద్యుత్ మీటర్ల మార్పు, అధిక విద్యుత్ బిల్లులు, తదితర సమస్యలను పౌరపట్టిక ప్రకారం నిర్దేశించిన సమయానికి విద్యుత్ సిబ్బంది పరిష్కరించకపోవడాన్ని గుర్తించింది ఏపీఈఆర్సీ. గత ఏడాది 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31వ తేదీ వరకు ఏడాది కాలంలో సేవల్లో జరిగిన జాప్యాన్ని గుర్తించి అందుకు బాధ్యులైన విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్లతో పాటు సిబ్బందికి రూ.4,96,950 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధ్యుల జీతాల్లో కోత విధించాలని సంబంధిత ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కోత వేసిన మొత్తాన్ని విద్యుత్ సేవల్లో జాప్యానికి గురైన సదరు వినియోగదారులకు అందజేయాలని ఆదేశించింది.
డివిజన్ జరిమానా
నెల్లూరు టౌన్ రూ.1,36,250
నెల్లూరు రూరల్ రూ.1,08,700
కావలి రూ.1,05,450
ఆత్మకూరు రూ. 16,050
గూడూరు రూ. 56,250
నాయుడుపేట రూ. 74,250
మొత్తం రూ.4,96,950
సేవల్లో నిర్లక్ష్యంపై ఏపీఈఆర్సీ కొరడా
సిబ్బందికి రూ.4,96,950 జరిమానా
వేతనాల్లో నుంచి కోతకు ఆదేశం
బాధ్యతగా పనిచేయాలన్నదే ఉద్దేశం
పౌరపట్టిక ప్రకారం విద్యుత్ వినియోగదారులకు నిర్ణీత కాలంలో సేవలు అందించాలి. అయితే విద్యుత్ సిబ్బంది సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించడాన్ని గుర్తించిన ఏపీఈఆర్సీ అపరాధ రుసుం విధించింది. ఈ మొత్తాన్ని క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది జీతాల్లో కోత విధించింది. విద్యుత్ సిబ్బంది బాధ్యతగా పనిచేయడమే ఏపీఈఆర్సీ ప్రధాన ఉద్దేశం.
– విజయన్, ఎస్‌ఈ,
ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్
