
● అసిస్టెంట్ కలెక్టర్,
మర్రిపాడు తహసీల్దార్ సంజనా సిన్హా
ఆత్మకూరురూరల్(మర్రిపాడు): మర్రిపాడు మండలంలో సెప్టెంబర్ 3 నుంచి 30వ తేదీ వరకు తహసీల్దార్‌గా విధులు నిర్వహించడం ద్వారా రెవెన్యూ సమస్యలపై లోతైన అధ్యయనం చేయగలిగామని అసిస్టెంట్ కలెక్టర్ సంజనా సిన్హా తెలిపారు. శనివారం మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయంలో ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. తాను తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టే నాటికి మర్రిపాడు మండలంలో 400 అడంగల్ మ్యుటేషన్ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, సాంకేతిక కారణాల వల్ల 33 తప్ప మిగిలినవన్నీ పరిష్కరించామని తెలిపారు. తగు ఆధారాలు రైతుల నుంచి సేకరించి చట్టబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. పొంగూరు గ్రామంలో ప్రభుత్వ భూముల్లోకి రాకపోకలు సాగించే దారి సమస్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉండగా స్థానిక రైతులతో మాట్లాడి పరిష్కరించామని తెలిపా రు. అలాగే భూముల రీసర్వేకు సంబంధించి 3 రోవర్స్, 3 అధికారుల బృందాలతో వేగవంతంగా కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మర్రిపాడు మండలంలో హైలెవల్ కాలువ నిర్మాణం ద్వారా ఐదు రిజర్వాయర్ల ఏర్పాటు, కాలువల తవ్వకం, 3 జాతీయ రహదారుల నిర్మాణం తదితర ప్రభుత్వ కార్యకలాపాల వల్ల భూములకు విపరీతమైన గిరాకీ ఏర్పడిందని, అదే సమయంలో రెవెన్యూ వివాదాలు కూడా పెరిగాయన్నారు. నిబంధనల ప్రకారం అన్ని అంశాలను క్షేత్ర పరిశీలన చేశామన్నారు. నందవరం, చిలకపాడు, చిన్నమాచనూరు, కదిరినేనిపల్లి గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశామని, పెగళ్లపాడు, ఇర్లపాడు, చాబోలు, పల్లవోలు గ్రామాల్లో భూముల రీసర్వే ముమ్మరంగా కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం మండలంలోని 43 పోలింగ్ స్టేషన్లకు 43 మంది బీఎల్‌ఓలను నియమించి ఓటర్ల జాబితా పకడ్బందీగా తయారు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. దాదాపు నెల రోజులుగా మర్రిపాడు మండలంలో తహసీల్దార్ బాధ్యతలు నిర్వహించిన తనకు స్థానిక ప్రజలు గొప్ప సహకారం అందించారని, సొంత ఇంట్లో ఉన్న భావనతో విధులు నిర్వహించగలిగానని చెబుతూ మండల ప్రజలకు ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.