నెల్లూరు(క్రైమ్) : పైళ్లెన రెండో రోజు నుంచే భర్త, అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఓ వివాహిత మంగళవారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు.. పడారుపల్లి కావేరినగర్‌కు చెందిన వెంకటశాంతి లక్ష్మికి గతేడాది మే 25న ఉదయగిరి మండలం ముసాయిపేటకు చెందిన వెంకటసుబ్బయ్యతో వివాహమైంది. వారి స్తోమతకు తగట్టుగా కట్నకానుకులు ఇచ్చారు. వివాహ అనంతరం 27న దంపతులు ముసాయిపేటకు వెళ్లారు. అదేరోజు రాత్రి భర్త, అత్తింటివారు ఆమెను ఓ గదిలో బంధించి నల్లగా ఉన్నావని, ఇచ్చిన బంగారం సరిపోలేదని, అదనంగా డబ్బులు తీసుకురావాలని హింసించారు. మరుసటిరోజు లక్ష్మి తండ్రిని పిలిపించి పుట్టింటికి పంపేశారు. లక్ష్మి తల్లిదండ్రులు పెద్ద మనుషుల సమక్షంలో రాజీ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంకటసుబ్బయ్యతో పాటు అతని తల్లిదండ్రులు, సోదరి, ఆమె భర్తపై పోలీసులు వేధింపుల కేసు నమోదు చేశారు.