
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 19) భారత్, ఇంగ్లండ్ జట్లు (india vs England) తలపడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది.
వన్ డౌన్ బ్యాటర్ హీథర్ నైట్ (Heather Knight) (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్‌తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది.
మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టగా.. శ్రీ చరణి 2 వికెట్లు తీసింది.
ప్రస్తుత ప్రపంచకప్‌లో హీథర్ నైట్ చేసిన సెంచరీ ఎనిదవది. ఆమె తన 300వ అంతర్జాతీయ మ్యాచ్‌లో మూడంకెల మార్కును చేరుకుంది. హీథర్‌కు ముందు ప్రస్తుత ప్రపంచకప్‌లో అలైస్సా హీలీ 2 సెంచరీలు, సోఫీ డివైన్, నాట్ సీవర్ బ్రంట్, ఆష్లే గార్డ్‌నర్, తజ్మిన్ బ్రిట్స్, బెత్ మూనీ తలో సెంచరీలు చేశాడు.
కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. భారత్‌తో మ్యాచ్‌లో గెలిస్తే ఇంగ్లండ్ కూడా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే విషయంలో భారత్‌కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. భారత్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింట ఓడి నాలుగో స్థానంలో ఉంది.