
టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్ నో బాల్స్ వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేల ఓ ఆసక్తికర కార్టూన్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. శ్రీలంకతో మొన్న (జనవరి 5) జరిగిన రెండో టీ20లో ఏకంగా 5 నో బాల్స్ వేసి టీమిండియా ఓటమికి పరోక్ష కారణమైన అర్షదీప్‌కు భారత అభిమాని ఒకరు కార్టూన్ ద్వారా ఓ సలహా ఇచ్చాడు. అర్షదీప్ జీవితంలో ఒక్క నో బాల్ కూడా వేయకుండా ఉండాలంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయించండి అంటూ ఓ కార్టూన్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
ఈ కార్టూన్‌లో బౌలర్ పర్వతం అంచున ఉన్న క్రీజ్ గుండా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బౌలర్ క్రీజ్ దాటి నో బాల్ వేస్తే లోయలో పడిపోతాడు. అర్షదీప్ కోసం సరదాగా పోస్ట్ చేసిన ఈ కార్టూన్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు.. అవును ఇది కరెక్టే.. ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తే అర్షదీపే కాదు ప్రపంచంలో ఏ బౌలర్ కూడా క్రీజ్ దాటి నో బాల్ వేసే సాహసం చేయలేడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
This is the Special pitch to practice for #arshdeepsingh
— Abhijit sarkar (@singlecoreGG) January 6, 2023
#INDvSL #UmranMalik pic.twitter.com/FeqwaZUVeq
కాగా, శ్రీలంకతో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ బౌల్ చేసిన అర్షదీప్ వరుసగా మూడు నోబాల్స్ సంధించాడు. ఆతర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో మరో రెండు నో బాల్స్ వేసి అభిమానులు, సహచరులతో సహా విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 2 ఓవర్లు వేసిన అర్షదీప్ ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని టీమిండియా ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు.
ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైన విషయం తెలిసిందే. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (జనవరి 7) రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది.