IND Vs BAN: హమ్మయ్య గెలిచాం.. భారత్‌ను గెలిపించిన అ‍య్యర్‌, అశ్విన్‌

Team India Won-By 3 Wickets 2nd Test Vs BAN Clinch 2-0 Series Victory - Sakshi

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను పీకల మీదకు తెచ్చుకుంది. లోయర్‌ ఆర్డర్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లు కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  ఈ విజయంతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. శ్రేయాస్‌ అయ్యర్‌(46 బంతుల్లో 29 నాటౌట్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌(62 బంతుల్లో 42 నాటౌట్‌) ఎనిమిదో వికెట్‌కు 71 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా గెలిపించారు. ఒకవైపు బంగ్లాదేశ్‌ స్పిన్నర్లు మెహదీ హసన్‌, షకీబ్‌ అల్‌ హసన్‌లు పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ వరుసగా వికెట్లు తీస్తూ టీమిండియాను భయపెట్టారు. 45/4 క్రితం రోజు స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా కాసేపటికే జయదేవ్‌ ఉనాద్కట్‌ రూపంలో ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రిషబ్‌ పంత్‌ 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన అశ్విన్‌తో కలిసి శ్రేయాస్‌ అయ్యర్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తాగా ఆడాడు. బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు అనవసర షాట్లకు పోకుండా సింగిల్స్‌, డబుల్స్‌ మీద దృష్టిపెట్టారు. ఆ తర్వాత అయ్యర్‌ బ్యాట్‌ నుంచి వరుసగా ఫోర్లు రావడంతో టీమిండియా ఒత్తిడి నుంచి బయటపడింది. ఆపై అశ్విన్‌ కూడా అయ్యర్‌కు చక్కగా సహకరించడంతో టీమిండియా విజయం దిశగా అడుగులు వేసింది. అయితే చివర్లో టీమిండియాను భయపెట్టిన బంగ్లా బౌలర్‌ మెహదీ హసన్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ సిక్స్‌, ఫోర్‌ కొట్టి టీమిండియాను గెలిపించాడు. మొత్తానికి రెండో టెస్టు గెలిచిన టీమిండియా సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 

బంగ్లాదేశ్‌:
తొలి ఇన్నింగ్స్‌: 227 ఆలౌట్‌
రెండో ఇన్నింగ్స్‌: 213 ఆలౌట్‌

టీమిండియా:
తొలి ఇన్నింగ్స్‌: 314 ఆలౌట్‌
రెండో ఇన్నిం‍గ్స్‌: 145/7 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top