టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్న టీమిండియా | TEAM INDIA RETAIN TOP SPOT IN ICC T20I ANNUAL TEAM RANKING | Sakshi
Sakshi News home page

టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్న టీమిండియా

May 5 2026 4:04 PM | Updated on May 5 2026 5:20 PM

TEAM INDIA RETAIN TOP SPOT IN ICC T20I ANNUAL TEAM RANKING

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక పురుషుల టీ20 జట్ల ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్‌ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2026 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత్, తాజా ర్యాంకింగ్స్‌లో 275 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

ఈ జాబితాలో ఇంగ్లండ్‌ 262 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 258 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య తేడా స్వల్పంగా తగ్గినప్పటికీ, భారత్‌ టాప్‌ ర్యాంక్‌ను నిలుపుగోగలిగింది.

గత రెండు సంవత్సరాల్లో టీ20 ఫార్మాట్‌లో భారత్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. వరుసగా 2024, 2026 టీ20 ప్రపంచకప్ టైటిళ్లను గెలుచుకోవడంతో పాటు, ఈ మధ్యకాలంలో ఆడిన అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లలో అజేయంగా నిలిచింది. ఈ విజయాలే భారత జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాయి.

ఇక ర్యాంకింగ్స్‌లో నాలుగో నుంచి ఏడో స్థానాల వరకు పెద్ద మార్పులు లేవు. న్యూజిలాండ్‌ (247), సౌతాఫ్రికా (244), పాకిస్తాన్‌ (240), వెస్టిండీస్‌ (233) వరుస స్థానాలు దక్కించుకున్నాయి.

దిగువ స్థానాల్లో మాత్రం స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్‌ జట్టు ఎనిమిదో స్థానానికి ఎగబాకగా, శ్రీలంక తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 220 పాయింట్లతో పదో స్థానాన్ని నిలబెట్టుకుంది.

పసికూన అమెరికా జట్టు మంచి పురోగతి సాధిస్తూ 13వ స్థానానికి చేరుకోగా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్లు ఒక్కో స్థానం దిగజారాయి. 2026 ప్రపంచకప్‌లో ఆకట్టుకున్న ఇటలీ జట్టు గణనీయంగా మెరుగై 23వ స్థానానికి ఎగబాకింది.

మొత్తంగా తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతుండగా, ఇతర జట్లు కూడా క్రమంగా పోటీని పెంచుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement