Ind Vs Aus: టీమిండియాతో వన్డే సిరీస్‌.. ఆస్ట్రేలియాకు భారీ షాక్‌

Steven Smith To Captain Australia In ODI Series Against India, Cummins To Remain At Home - Sakshi

మార్చి 17 నుంచి టీమిండియాతో ప్రారంభంకాబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన తల్లి మరణాంతర కార్యక్రమాలు జరిపించేందుకు కమిన్స్‌ స్వదేశంలోనే ఉండిపోనున్నాడు. దీంతో అతని గైర్హాజరీలో స్టీవ్‌ స్మిత్‌ ఆస్ట్రేలియా సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఇవాళ (మార్చి 14) అధికారికంగా ప్రకటించింది. అయితే సీఏ.. కమిన్స్‌కు రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించకపోవడం విశేషం.

భారత్‌తో వన్డేలకు ఆసీస్‌ 15 మంది సభ్యులతోనే కంటిన్యూ కానుంది. టెస్ట్‌ సిరీస్‌ మధ్యలో గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిన డేవిడ్‌ వార్నర్‌, దేశవాలీ టోర్నీ ఆడేందుకు వెళ్లిన ఆస్టన్‌ అగర్‌ తిరిగి వన్డే జట్టులో చేరిపోగా.. అదే టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా గాయపడిన జై రిచర్డ్‌సన్‌ రీప్లేస్‌మెంట్‌ నాథన్‌ ఇల్లీస్‌ కూడా వన్డే జట్టులో కొనసాగనున్నాడు.

కాగా, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో రెండో టెస్ట్‌ అనంతరం కమిన్స్‌ తల్లి బాగోగులు చూసుకునేందుకు ఆస్ట్రేలియాకు బయలుదేరిన విషయం తెలిసిందే. తదనంతరం తల్లి మారియా మరణించడంతో కమిన్స్‌ ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. కమిన్స్‌ గైర్హాజరీలో స్టీవ్‌ స్మిత్‌ 3, 4 టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాను విజయవంతంగా ముందుండి నడిపించాడు.

స్మిత్‌ సారధ్యంలో మూడో టెస్ట్‌లో ఆసీస్‌ భారత్‌ను ఓడించగా, నాలుగో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఫలితంగా 4 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, స్టీవ్‌ స్మిత్‌ ఆసీస్‌ వన్డే జట్టు పగ్గాలు చేపట్టనుండటంతో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. భారత్‌తో తొలి వన్డే కలుపుకుని 5 వన్డేల్లో (ఆరోన్‌ ఫించ్‌, పాట్‌ కమిన్స్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, స్టీవ్‌ స్మిత్‌) ఆసీస్‌కు నలుగురు కెప్టెన్లు సారధ్యం వహించారు. 

భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు..
డేవిడ్‌ వార్నర్‌, ట్రవిస్‌ హెడ్‌, స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), మార్నస్‌ లబూషేన్‌, మిచెల్‌ మార్ష్‌, మార్కస్‌ స్టొయినిస్‌, అలెక్స్‌ క్యారీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, కెమరూన్‌ గ్రీన్‌, జోష్‌ ఇంగ్లిస్‌, సీన్‌ అబాట్‌, అస్టన్‌ అగర్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ ఇల్లిస్‌, ఆడమ్‌ జంపా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top