13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ | Rohit Sharma Rolls Back The Clock vs LSG, Breaks 13 Year-Old IPL Record | Sakshi
Sakshi News home page

13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ

May 5 2026 12:36 PM | Updated on May 5 2026 12:42 PM

Rohit Sharma Rolls Back The Clock vs LSG, Breaks 13 Year-Old IPL Record

ఐపీఎల్‌ 2026లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు. గాయం నుంచి తిరిగి వచ్చిన వెంటనే అద్భుత ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. అంతేకాకుండా 13 ఏళ్ల పాత రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వాంఖడే వేదికగా నిన్న (మే 4) లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమురేపాడు. భారీ లక్ష్య ఛేదనలో కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

ఈ క్రమంలో ఓ భారీ వ్యక్తిగత రికార్డు నెలకొల్పాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల (7) రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 6 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అదీ 13 ఏళ్ల కిందట తొలిసారి ఈ ఫీట్‌ను సాధించాడు. 2013 ఎడిషన్‌లో ఇదే వాంఖడే వేదికగా పంజాబ్‌పై సిక్సర్ల సిక్సర్‌ కొట్టాడు. ఆతర్వాత 3 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో రెండు సెంచరీలు చేసినా, వాటిలోనూ తలా ఐదు సిక్సర్లు మాత్రమే బాదాడు.

తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ అలవోకగా సిక్సర్లు బాదుతుంటే చూడముచ్చటగా ఉండింది. వింటేజ్‌ రోహిత్‌ శర్మను గుర్తు చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సహచర ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 143 పరుగులు జోడించి, గెలుపుకు బలమైన పునాది వేశాడు.

రోహిత్‌-రికెల్టన్‌ వీరవిహారం చేయడంతో లక్నో నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్‌ సునాయాసంగా (మరో 8 బంతులు మిగిలుండగానే) ఛేదించింది. ఇది ఐపీఎల్‌ చరిత్రలో ఆ జట్టుకు అత్యధిక ఛేదనగానూ నిలిచింది. ఈ గెలుపుతో ముంబై ప్లే ఆఫ్స్‌ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. తదుపరి ఆడబోయే 4 మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే, ప్లే ఆఫ్స్ రేసులో ఉండే అవకాశం ఉంది. మే 10న జరిగే తదుపరి మ్యాచ్‌లో ముంబై ఆర్సీబీతో తలపడనుంది. ఆతర్వాతి మ్యాచ్‌ల్లో పంజాబ్‌, కేకేఆర్‌, రాజస్థాన్‌ జట్లను ఢీకొట్టాల్సి ఉంది.‌

Advertisement
 
Advertisement
Advertisement