#RinkuSingh: డెత్‌ ఓవర్లలో 'కింగ్‌' అనిపించుకుంటున్న రింకూ సింగ్‌

Rinku Singh Stands 1st Position Most Runs Death Overs IPL 2023 Season - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కేకేఆర్‌కు దొరికిన ఆణిముత్యం రింకూ సింగ్‌. మూడు సీజన్ల నుంచి అతను కేకేఆర్‌కు ఆడుతున్నప్పటికి ఏ సీజన్‌లోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్‌ను గెలిపించి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఆ తర్వాత కూడా అదే టెంపోను కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్‌ డెత్‌ ఓవర్లలో కింగ్‌గా మారిపోయాడు. 

తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనూ స్లోపిచ్‌పై తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. హాఫ్‌ సెంచరీ మిస్‌ అయినప్పటికి రింకూ సింగ్‌ 35 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులతో సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. అతని బ్యాటింగ్‌తోనే కేకేఆర్‌ 170 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది.


Photo: IPL Twitter

ఈ క్రమంలోనే రింకూ సింగ్‌ ఒక రికార్డు అందుకున్నాడు. ఈ సీజన్‌లో డెత్‌ ఓవర్లలో(17-20 ఓవర్ల మధ్య) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రింకూ సింగ్‌ తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు డెత్‌ ఓవర్లలో 197.53 స్ట్రైక్‌రేట్‌తో 161 పరుగులు చేశాడు. రింకూ సింగ్‌ తర్వాత షిమ్రోన్‌ హెట్‌మైర్‌ 200 స్ట్రైక్‌రేట్‌తో 144 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. టిమ్‌ డేవిడ్‌ 213.11 స్ట్రైక్‌రేట్‌తో 130 పరుగులతో మూడో స్థానంలో.. ఇక ద్రువ్‌ జురేల్‌ 205 స్ట్రైక్‌రేట్‌తో 115 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

దీంతో పాటు కేకేఆర్‌ జట్టు మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో పవర్‌ప్లేలో మూడు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసిన కేకేఆర్‌.. మిడిల్‌ ఓవర్లలో(7-14 ఓవర్లు) 9.75 రన్‌రేట్‌తో 78 పరుగులు చేసి ఒక వికెట్‌ నష్టపోయింది. ఇక డెత్‌ ఓవర్లలో(15-20 ఓవర్లు) ఐదు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. కాగా మిడిల్‌ ఓవర్లలో కేకేఆర్‌ ఈ సీజన్‌లో 8.9 రన్‌రేట్‌తో 801 పరుగులు చేయడం విశేషం. కేకేఆర్‌ మినహా ఏ జట్టు మిడిల్‌ ఓవర్లలో ఇన్ని పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాయి.

చదవండి: సంచలన క్యాచ్‌తో మెరిసిన ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top