IPL 2022: ఐపీఎల్‌ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న ఎస్‌ఆర్‌హెచ్‌..!

Reports: 3 Players SRH are likely to release ahead of next season - Sakshi

ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తీవ్రంగా నిరాశ పరిచింది. మరోసారి లీగ్‌ దశలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది సీజన్‌ను ఓటములతో ఆరం‍భించిన ఎస్‌ఆర్‌హెచ్‌.. సీజన్‌ మధ్యలో వరుసగా ఐదు విజయాలు సాధించి హైదరాబాద్‌ తిరిగి గాడిలో పడింది. అయితే తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇక డేవిడ్‌ వార్నర్‌ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన  కేన్ విలియమ్సన్.. జట్టును విజయం పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా విలియమ్సన్ నిరాశపరిచాడు.13 మ్యాచ్‌లు ఆడిన  విలియమ్సన్ 216 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ విఫలమైనప్పటికీ కొంత మంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఉమ్రాన్ మాలిక్, రాహుల్‌ త్రిపాఠి, అభిషేక్‌ శర్మ అత్యుత్తమంగా రాణించారు. ఇక మరి కొంత మంది ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా కనబర్చలేదు. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు ఓ ముగ్గురి ఆటగాళ్లని ఎస్‌ఆర్‌హెచ్‌ విడిచి పెట్టే అవకాశం ఉంది.

సీన్ అబాట్
ఆస్ట్రేలియాకు చెందిన 30 ఏళ్ల పేసర్‌ను ఐపీఎల్‌-2022 మెగా వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. సీన్ అబాట్‌కు ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడిన అనుభవం ఉంది. బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు అబాట్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే తన ప్రతిభను నిరూపించుకోవడానికి  ఈ ఏడాది సీజన్‌లో అతడికి చాలా తక్కువ అవకాశాలు లభించాయి.

కేవలం ఒకే మ్యాచ్‌ ఆడిన అబాట్‌.. తన నాలుగు ఓవర్ల కోటాలో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. దీంతో అతడికి తర్వాత మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్క లేదు. ఇప్పటికే నటరాజన్‌, భవనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ రూపంలో నాణ్యమైన పేసర్లు ఉండటంతో రాబోయే సీజన్‌కు ముందు అబాట్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ విడిచి పెట్టే అవకాశం ఉంది.

ఫజల్హక్ ఫారూఖీ
ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గత కొద్ది కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తున్నాడు. దీంతో ఐపీఎల్‌ మెగా వేలంలో ఫారూఖీని రూ. 50 లక్షలకు ఎస్‌ఆర్‌హెచ్‌ కొనుగోలు చేసింది. కాగా ఫారూఖీ మాత్రం ఐపీఎల్‌లో రాణించడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడిని విడిచి పెట్టి మరో కొత్త పేసర్‌ను సన్‌రైజర్స్‌ కొనుగోలు చేయచ్చు.

శ్రేయస్‌ గోపాల్‌
ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉన్న శ్రేయస్ గోపాల్‌ను మెగా వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే జట్టులో వాషింగ్టన్‌ సుందర్‌, జగదీషా సుచిత్‌ వంటి ఆల్‌రౌండర్‌లు ఉండటంతో గోపాల్‌ పెద్దగా అవకాశం దక్కలేదు. ఈ ఏడాది సీజన్‌లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన గోపాల్‌.. 3 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఇక వికెట్‌ సాధించాడు. దీంతో వచ్చే ఏడాది సీజన్‌లో గోపాల్‌ స్థానంలో ఓ యువ ఆటగాడిని భర్తీ చేసే అవకాశం ఉంది.
చదవండిIND vs SA: టీమిండియాను భయపెడుతోన్న దక్షిణాఫ్రికా త్రయం.. గెలవడం అంత ఈజీ కాదు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top