Karimnagar: అగ్రహారం నుంచి బీసీసీఐ దాకా! | Ranjit Kumar Hyderabad Senior Men Teams Strengh Conditioning Coach | Sakshi
Sakshi News home page

Karimnagar: అగ్రహారం నుంచి బీసీసీఐ దాకా!

May 5 2026 3:57 PM | Updated on May 5 2026 4:21 PM

Ranjit Kumar Hyderabad Senior Men Teams Strengh Conditioning Coach

క్రికెటర్‌గా ఎదగడం ఆషామాషీ విషయం కాదు. ముఖ్యంగా మధ్య తరగతి పిల్లల్లో చాలా మందికి ఈ కల అందని ద్రాక్ష లాంటిదే. రంజిత్‌ విషయంలోనూ ఇదే జరిగింది. క్రికెటర్‌ కావాలన్న ఆశయానికి మధ్యలోనే గండిపడింది. కారణాలు ఏవైనా.. ప్రతిభ ఉన్నా సరే అతడు అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాడు.

అయినప్పటికీ క్రికెట్‌పై ప్రేమను వదులుకోలేకపోయాడు. స్నేహితుడు ఇచ్చిన సలహా అతడికి కొత్త దారి చూపించింది. ఆట, ఆటగాళ్లతో మమేకమయ్యే వీలు కల్పించింది. హైదరాబాద్‌ మేటి క్రికెటర్లు మహ్మద్‌ సిరాజ్‌, తిలక్‌ వర్మలతో పాటు.. అమన్‌ రావు వంటి వర్ధమాన క్రికెటర్లకు ఫిట్‌నెస్‌ మెళకువలు నేర్పే స్థాయికి చేర్చింది.

‍తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మండలంలోని అగ్రహారం రంజిత్‌ కుమార్‌ స్వస్థలం. తల్లిదండ్రులు ఏనుగుల బీరయ్య, ఏనుగుల భాగ్య. వారిది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఉపాధి నిమిత్తం రంజిత్‌ తండ్రి హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఓవైపు చదువుకుంటూనే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న రంజిత్‌.. తండ్రికి మనసులోని మాట చెప్పాడు.

ఎంబీఏ చదివాడు
ఆర్థికంగా కష్టంగా ఉన్నా కుమారుడి ఆశయానికి ఆయన అడ్డుచెప్పలేదు. జూనియర్‌ లెవల్లో హైదరాబాద్‌ తరఫున కొడుకు సత్తా చాటుతుంటే మురిసిపోయారు. కానీ అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?.. ప్రతిభ ఉన్నా కొన్ని అనుకోని అడ్డంకుల వల్ల క్రికెటర్‌ కావాలన్న రంజిత్‌ కల ముగిసిపోయింది.

ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టిన రంజిత్‌.. ఎంబీఏ పూర్తి చేశాడు. అయితే, భవిష్యత్తుపై అప్పుడు అతడికి ఎలాంటి స్పష్టతా లేదు. మనసంతా క్రికెట్‌ మీదే ఉంది. ఆ సమయంలోనే స్నేహితుడొకరు ఫిట్‌నెస్‌ ఇండస్ట్రీ గురించి రంజిత్‌కు చెప్పాడు. అసలు తనకు ఏమాత్రం అవగాహన లేని రంగంలోకి వెళ్లడం సరైందేనా అని అతడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాడు.

అవగాహన లేని రంగంలోకి వెళ్లి.. సక్సెస్‌
ఏం జరిగినా మన మంచికే అనుకుని రంగంలోకి దిగాడు. కొన్నాళ్లపాటు దారీతెన్నూ లేకుండా రంజిత్‌ ప్రయాణం సాగింది. అయితే, కఠిన శ్రమకు కచ్చితంగా ఫలితం దక్కుతుందంటారు. తన ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న రంజిత్‌..  స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా ఎదిగాడు.

ఆటగాళ్ల జీవితంలో అత్యంత కీలక పాత్ర స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌దేనన్న సంగతి తెలిసిందే. ప్లేయర్ల ఫిట్‌నెస్, బలం, వేగం, చురుకుదనాన్ని పెంచడం.. అదే విధంగా గాయాల బారిన పడకుండా వారి ఆట తీరును మెరుగుపరచడం వీరి ప్రధాన బాధ్యతలు.

తిలక్‌ వర్మ, సిరాజ్‌ వంటి ఆటగాళ్లతో
ఇక ఒక్కో మెట్టు ఎక్కిన రంజిత్‌ కుమార్‌.. హైదరాబాద్‌ సీనియర్‌ మెన్స్‌ జట్టు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా ఎదిగాడు. రంజీ ట్రోఫీ, దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లలో తిలక్‌ వర్మ, సిరాజ్‌ వంటి ఆటగాళ్లతో నిండిన జట్లకు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. 

బీసీసీఐ-ఎన్‌సీఏ అక్రిడేషన్‌ పొందిన రంజిత్‌ కుమార్‌.. ప్రస్తుతం పెర్ఫామెన్స్‌ కోచింగ్‌లో మాస్టర్స్‌ చేస్తున్నాడు. ఇటీవలే BCCI COE అండర్‌-19 బాయ్స్‌ క్యాంప్‌నకు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు.

చిన్ననాడు కలలు కన్నట్లుగా తానొక స్టార్‌ క్రికెటర్‌ కాలేకపోయినా.. ఎంతో మంది ఆటగాళ్లు తమ కెరీర్‌ సజావుగా కొనసాగించేందుకు కోచ్‌గా రంజిత్‌ తన ప్రతిభను ఉపయోగిస్తున్నాడు. విధి తనకు ఓ దారి మూసివేసినా.. కుంగిపోకుండా మొక్కవోని దీక్షతో మరో దారిలో తన గమ్యాన్ని చేరుకున్న రంజిత్‌ కుమార్‌ యువతకు ఆదర్శం.

చదవండి: హార్దిక్‌ పాండ్యాపై వేటు.. ముంబై కెప్టెన్‌గా తొలగింపు?

Advertisement
 
Advertisement
Advertisement