Under-19 World Cup Final: ఐదు వికెట్లతో దుమ్మురేపిన రాజ్‌ బవా.. తొలి భారత బౌలర్‌గా

Raj Bawa Becomes First Indian Cricketer 5 Wicket Hual ICC Under-19 Final - Sakshi

అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో యంగ్‌ ఇండియా అదరగొట్టింది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌ 189 పరుగులకే కుప్పకూలింది. ఫాస్ట్‌ బౌలర్లు రాజ్‌ బవా, రవి కుమార్‌లు పోటీ పడి వికెట్లు తీశారు. ముఖ్యంగా రాజ్‌ బవా 31 పరుగులిచ్చి ఐదు వికెట్లతో మెరిసి ఫైనల్ మ్యాచ్‌ను గొప్పగా మలుచుకున్నాడు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్లలో జార్జ్‌ థామస్‌(27), విల్‌ లుక్స్‌టన్‌(4), జార్జి బెల్‌(0), రెహన్‌ అహ్మద్‌(10), చివరగా జోషువా బోయ్‌డెన్‌(1)నే ఔట్‌ చేసి ఈ ఫీట్‌ సాధించాడు. ఈ నేపథ్యంలోనే రాజ్‌ బవా ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు. అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా తరపున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌ బౌలర్‌ అన్వర్‌ అలీ(2006) తర్వాత ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రాజ్‌ బవా నిలవడం విశేషం.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

కాగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్‌ వేలం జరగనున్న నేపథ్యంలో అండర్‌-19 కుర్రాళ్లకు జాక్‌పాట్‌ అనే చెప్పొచ్చు. యంగ్‌ ఇండియా నుంచి మొత్తం 9 మంది ఆటగాళ్లు( యశ్‌ ధుల్‌, హర్నూర్‌ సింగ్‌, కుశాల్ తాంబే, అనీశ్వర్‌ గౌతమ్‌, రాజ్ అంగద్‌ భవ, రాజ్‌వర్థన్ హంగార్గేకర్, విక్కీ ఓస్వల్‌, వాసు వత్స్, పుష్పేంద్ర సింగ్‌ రాథోడ్‌) వేలం బరిలో అదృష్టాన్ని  పరిక్షించుకోనున్నారు. వీరిలో కెప్టెన్‌ యశ్‌ ధుల్‌, ఓపెనర్ హర్నూర్ సింగ్‌, ఆల్‌రౌండర్లు రాజ్ అంగద్‌ భవ, రాజ్‌వర్థన్ హంగార్గేకర్, స్పిన్‌ బౌలర్‌ విక్కీ ఓస్వల్‌లకు వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది. ఇక ఫైనల్లో ఐదు వికెట్లతో మెరిసిన రాజ్‌ బవాకు వేలంలో జాక్‌పాట్‌ తగిలే అవకాశం ఉంది. ఫైనల్‌మ్యాచ్‌లో కీలక సమయంలో రాణించిన రాజ్‌ బవాకు ఇది మంచి పరిణామమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top