Australian Open: చరిత్రకు చేరువగా...

Rafael Nadal and Medvedev Will Play in Australian Open Final - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల

సింగిల్స్‌ ఫైనల్లో రాఫెల్‌ నాదల్‌

సెమీఫైనల్లో బెరెటినిపై విజయం

తుది పోరులో మెద్వెదెవ్‌తో ‘ఢీ’

గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా నాదల్‌ రికార్డు  

ఇద్దరు దిగ్గజాలు రోజర్‌ ఫెడరర్, నొవాక్‌ జొకోవిచ్‌లను వెనక్కి నెట్టేసి కొత్త చరిత్ర సృష్టించేందుకు స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఒకే ఒక్క విజయం దూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన ఈ మాజీ చాంపియన్‌ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు.

ప్రపంచ రెండో ర్యాంకర్, గత ఏడాది రన్నరప్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)తో ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్‌ గెలిస్తే... పురుషుల టెన్నిస్‌ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో నాదల్, ఫెడరర్, జొకోవిచ్‌ ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు.

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అతి కష్టమ్మీద గట్టెక్కిన స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ సెమీఫైనల్‌ అడ్డంకిని మాత్రం మరీ శ్రమించకుండానే దాటేశాడు. ఏడో సీడ్‌ మాటియో బెరెటిని (ఇటలీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఆరో సీడ్‌ నాదల్‌ 6–3, 6–2, 3–6, 6–3తో నెగ్గి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 35 ఏళ్ల నాదల్‌ 2009లో ఏకైకసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు.

ఆ తర్వాత 2012, 2014, 2017, 2019లలో రన్నరప్‌గా నిలిచాడు. బెరెటినితో 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో నాదల్‌ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు 28 విన్నర్స్‌ కొట్టాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసిన ఈ స్పెయిన్‌ స్టార్‌ కేవలం 19 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్‌ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. బెరెటిని 14 ఏస్‌లు సంధించినప్పటికీ 39 అనవసర తప్పిదాలు చేశాడు. నాదల్‌ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసే అవకాశం రాగా ఒకసారి మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు.

షపోవలోవ్‌తో నాలుగు గంటలకుపైగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సెట్‌లో నెగ్గి ఊపిరి పీల్చుకున్న నాదల్‌ సెమీఫైనల్లో మాత్రం బెరెటినికి ఏదశలోనూ అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్‌లో ఒకసారి, రెండో సెట్‌లో రెండుసార్లు, నాలుగో సెట్‌లో ఒకసారి బెరెటిని సర్వీస్‌లను బ్రేక్‌ చేసిన నాదల్‌ తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో గత ఏడాది రన్నరనప్‌ మెద్వెదెవ్‌ (రష్యా) తో నాదల్‌ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో నాదల్‌ 3–1తో ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో వీరిద్దరు ఒకేసారి (2019 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌) తలపడగా నాదల్‌ నెగ్గాడు.  
 

ఈసారీ మెద్వెదెవ్‌దే పైచేయి...
ఫిలిక్స్‌ (కెనడా)తో 4 గంటల 42 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో మ్యాచ్‌ పాయింట్‌ కాపాడుకొని గట్టెక్కిన మెద్వెదెవ్‌ సెమీఫైనల్లో మాత్రం నాలుగు సెట్‌లలో విజయం రుచి చూశాడు. 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో 25 ఏళ్ల మెద్వెదెవ్‌ 7–6 (7/5), 4–6, 6–4, 6–1తో నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను ఓడించాడు. గత ఏడాది కూడా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్లో సిట్సిపాస్‌నే ఓడించి మెద్వెదెవ్‌ ఫైనల్‌ చేరాడు. తొలి మూడు సెట్‌లలో మెద్వెదెవ్‌కు పోటీ ఎదురైనా నాలుగో సెట్‌లో మాత్రం ఈ రష్యా స్టార్‌ ఒకే గేమ్‌ కోల్పోయాడు. 13 ఏస్‌లు సంధించిన మెద్వెదెవ్‌ 39 విన్నర్స్‌ కొట్టాడు.

నేడు మహిళల సింగిల్స్‌ ఫైనల్‌
యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) X కొలిన్స్‌ (అమెరికా)
మధ్యాహ్నం గం. 2 నుంచి సోనీ సిక్స్‌లో లైవ్‌

29: ఇప్పటి వరకు తన కెరీర్‌లో నాదల్‌ చేరిన గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల ఫైనల్స్‌.

500: హార్డ్‌కోర్టులపై నాదల్‌ నెగ్గిన మ్యాచ్‌లు. ఈ జాబితాలో ఫెడరర్‌ (783), జొకోవిచ్‌ (634) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

3: కఫెల్నికోవ్‌ (1999, 2000), సఫిన్‌ (2004, 2005) తర్వాత వరుసగా రెండేళ్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన మూడో రష్యా ప్లేయర్‌గా మెద్వెదెవ్‌  గుర్తింపు పొందాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top