Novak Djokovic: జొకోవిచ్‌కు భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఒకవేళ ఓడితే అంతే సంగతులు!

Novak Djokovic in Australian Open draw despite visa uncertainty - Sakshi

మళ్లీ న్యాయ పోరాటానికి సెర్బియన్‌

ఆస్ట్రేలియా ఓపెన్‌ డ్రా చూస్తే సెర్బియన్‌ స్టార్‌ జొకోవిచ్‌ తప్పక బరిలోకి దిగుతాడనిపించింది. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీరు చూస్తుంటే ప్రపంచ నంబర్‌వన్‌కు బహిష్కరణ తప్పేలా లేదు. మామూలుగా టెన్నిస్‌ కోర్టులో ఆటగాడు ‘డబుల్‌ఫాల్ట్‌’ చేస్తాడు. కానీ ప్రభుత్వం దెబ్బకు ఈ టాప్‌సీడ్‌ ‘డబుల్‌ఫాల్ట్‌’ అయ్యాడు. రెండో సారీ అతని వీసా రద్దయింది. ఆసీస్‌ విదేశీ మంత్రిత్వశాఖ తన విచక్షణాధికారం మేరకు అతని వీసాను రెండోసారి రద్దు చేసింది.

దేశ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ‘టెన్నిస్‌ లెజెండ్‌’ను అమర్యాదగా సాగనంపబోమని, కొన్ని రోజులు ఇక్కడ ఉండే వెసులుబాటు ఇస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు జొకో మాత్రం ‘తగ్గేదేలే’... వెనక్కి వెళ్లేదేలే అంటున్నాడు. ప్రభుత్వ నిర్ణయంపై తన న్యాయపోరాటం కొనసాగిస్తానని తెలిపాడు. తన గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌లోని 20 టైటిళ్లలో 9 సార్లు విజేతగా నిలిపిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను అంత తేలిగ్గా వదిలేలా లేడు. ప్రాక్టీస్‌లో అతను శ్రమిస్తుంటే... అతని లీగల్‌ టీమ్‌ కోర్టులో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతోంది.

ఫెడరల్‌ సర్క్యూట్‌లోని ఫ్యామిలీ కోర్టులో అత్యవసర విచారణ కోసం అప్పీల్‌ చేసింది. సోమవారం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రారంభం కానుండటంతో ఫెడరల్‌ కోర్టు నేడు (శనివారం) అత్యవసర విచారణ చేపడుతుందా లేదంటే విచారణను తిరస్కరిస్తుందో తెలియాలంటే వేచిచూడక తప్పదు. ఈ ఫెడరల్‌ కోర్టులోనే మొదటిసారి రద్దయిన వీసాను పునరుద్దరించారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్టు నుంచి వీసా పునరుద్ధరణ లభించినప్పటికీ మళ్లీ రద్దు చేసే అధికారం విదేశీ మంత్రిత్వ శాఖకు ఉంటుంది. ఇప్పుడు ఆ శాఖ రద్దు చేసింది. ఇలా ఒక వ్యక్తికి వరుసగా రెండోసారి వీసా రద్దు చేస్తే... అతను మళ్లీ మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడానికి వీలుండదు. జొకో న్యాయ పోరాటం చేసి విఫలమైతే మూడేళ్లు అంటే 2025 వరకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడే అవకాశం రాదు.

చదవండి: Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్‌.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top