New Zealand Vs England, 2nd Test: New Zealand Beat England By 1 Run, Level Series 1-1 - Sakshi
Sakshi News home page

ENG Vs NZ: టెస్టు క్రికెట్‌లో సంచలనం.. పరుగు తేడాతో విజయం

Published Tue, Feb 28 2023 9:02 AM

New Zealand Won-By-1-Run Vs ENG 2nd Test Drawn Series With 1-1 - Sakshi

టార్గెట్‌ 258 పరుగులు.. బజ్‌బాల్‌ క్రికెట్‌తో దూసుకుపోతున్న ఇంగ్లండ్‌కు ఇది పెద్ద కష్టసాధ్యమైన లక్ష్యం మాత్రం కాదు. కానీ సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో బజ్‌బాల్‌ అంటూ వేగవంతమైన క్రికెట్‌ ఆడుతూ మంచి ఫలితాలు అందుకున్న ఇంగ్లీష్‌ జట్టుకు తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. టెస్టు క్రికెట్‌లో ఉండే మజా ఏంటో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ నిరూపించింది. 

వెల్లింగ్టన్‌ వేదికగా ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. 258 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 256 పరుగులకు ఆలౌటైంది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. ఒకసారి మ్యాచ్‌ ఇంగ్లండ్‌వైపు మొగ్గితే.. మరోసారి కివీస్‌ చేతిలోకి వచ్చింది. చివరకు ఒకే ఒక్క పరుగు.. ఇంగ్లండ్‌కు ఓటమి పలకరించగా.. అదే సమయంలో విజయంతో కివీస్‌ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకొని పరువు నిలుపుకుంది.  

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన జో రూట్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఐదు పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్న రూట్‌.. 95 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇదే మ్యాచ్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. రూట్‌ ఉన్నంతవరకు ఇంగ్లండ్‌ విజయం దిశగానే నడిచింది. అయితే మధ్యలో కివీస్‌ బౌలర్లు ఫుంజుకొని వికెట్లు తీయడంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది.

అయితే చివర్లో బెన్‌ స్టోక్స్‌(33 పరుగులు), బెన్‌ ఫోక్స్‌లు(35 పరుగులు) రాణించడంతో ఇంగ్లండ్‌ మరోసారి గెలుపు ట్రాక్‌ ఎక్కింది. ఈ దశలో కివీస్‌ బౌలర్లు సౌథీ, వాగ్నర్‌లు స్వల్ప వ్యవధి తేడాతో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌ ఒత్తిడిలో పడింది. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన దశలో అండర్స్‌ వాగ్నర్‌ బౌలింగ్‌లో టామ్‌ బ్లండెల్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఇంగ్లండ్‌ కథ ముగిసింది. నీల్‌ వాగ్నర్‌ నాలుగు వికెట్లు తీయగా.. సౌథీ మూడు, మాట్‌ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు. 

అంతకముందు ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 435 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. రూట్‌, హ్యారీ బ్రూక్‌లు సెంచరీలతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 209 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌ను ఇంగ్లండ్‌ ఫాలోఆన్‌ ఆడించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ సెంచరీతో​ మెరవడంతో 483 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌ ముందు 258 పరుగుల టార్గెట్‌ను ఉంచగలిగింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement