IPL 2022: గుజరాత్ టైటాన్స్‌లోకి సురేశ్ రైనా..!

Netizens Suggest Suresh Raina As Jason Roy Replacement For Gujarat Titans - Sakshi

ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన సురేశ్‌ రైనాకు అదృష్టం జేసన్‌ రాయ్‌ రూపంలో తలుపుతట్టనుందంటే అవుననే చెప్పాలి. ఇటీవల ముగిసిన వేలంలో జేసన్‌ రాయ్‌ని గుజరాత్ టైటాన్స్‌ రూ.2 కోట్ల కనీస ధరకు సొంతం చేసుకోగా.. వ్యక్తిగత కారణాల చేత అతను ఈ ఏడాది లీగ్‌కు అందుబాటులో ఉండనని సీజన్ ఆరంభానికి ముందే  ప్రకటించాడు. దీంతో రాయ్‌ స్థానాన్ని మిస్టర్‌ ఐపీఎల్‌ సురేశ్‌ రైనాతో భర్తీ చేయాలని నెటిజన్ల నుంచి భారీ ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. రైనా చేరికతో పసలేని గుజరాత్‌ జట్టుకు బలం చేకూరుతుందని, అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని నెటిజన్లు సూచిస్తున్నారు. రైనాకు 2016, 2017 సీజన్లలో నాటి గుజరాత్‌ లయన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవముందని, జేసన్‌ రాయ్‌ మాదిరిగానే రైనా కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్ధుడని, రైనాను రాయ్‌కి రిప్లేస్‌మెంట్‌గా తీసుకునేందుకు ఇంతకంటే పెద్ద అర్హతలు అవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం కూడా రైనాను తీసుకునేందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రైనా, జేసన్‌ రాయ్‌లకు గతంలో గుజరాత్‌ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది. ఈ ఫ్రాంచైజీ తరఫున రాయ్‌ కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడగా, రైనా.. రెండు సీజన్లలో కలిపి 40కి పైగా సగటుతో 800 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌ నుంచి సీఎస్‌కే (2016,2017ల్లో గుజరాత్‌ లయన్స్‌కు ఆడటం మినహా) జట్టుకు ఆడిన రైనా.. గత సీజన్‌ మినహాయించి లీగ్‌ మొత్తంలో అద్భుతంగా రాణించాడు. 205 మ్యాచ్‌ల్లో 32.52 సగటు, 135కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలున్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2022 సీజన్‌ మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. లీగ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ వెలువడాల్సి ఉంది. హార్ధిక్‌ పాండ్యా సారధ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌, కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ సీజన్‌ ద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

చదవండి:  IPL 2022: వేలంలో ఎవ‌రూ కొన‌లేదు.. క‌నీసం విదేశీ లీగ్‌లు ఆడే అనుమ‌తైనా ఇవ్వండి..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top