సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం : నటరాజన్‌

Natarajan Says Its Surreal Experience Represent As Player For Country - Sakshi

కాన్‌బెర్రా : ఆసీస్‌తో జరిగిన మూడో వన్డే ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.. టి. నటరాజన్‌. అరంగేట్రం మ్యాచ్‌లోనే రెండు కీల‍క వికెట్లను తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. మార్నస్‌ లబుషేన్‌ను అవుట్‌ చేయడం ద్వారా మెయిడెన్‌ వికెట్‌ తీసిన ఆనందక్షణాలను నటరాజన్‌ షేర్‌ చేసుకున్న తీరు అద్భుతం. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా నటరాజన్‌ మ్యాచ్‌ అనంతరం తన సంతోషాన్ని ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. (చదవండి : 'కోహ్లి వేగం మధ్యలోనే ఆగిపోతుందనుకున్నా')


'ఆసీస్‌తో మ్యాచ్‌ నాకు మంచి అనుభవంలా కనిపించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్విస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్ల కోసం ఎదురు చూస్తున్నా' అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన నటరాజన్‌ 232వ ప్లేయర్‌గా టీమిండియా తరపున వన్డే మ్యాచ్‌ ఆడాడు. ఈ సందర్భంగా బుధవారం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేతులు మీదుగా క్యాప్‌ అందుకున్నాడు. తమిళనాడు నుంచి టీమిండియాకి ఎంపికైన 5వ ఫాస్ట్‌ బౌలర్ నటరాజన్‌‌.. కాగా 2002లో లక్ష్మీపతి బాలాజీ తమిళనాడు నుంచి ఫాస్ట్‌ బౌలర్‌గా టీమిండియాకు ఎంపికయ్యాడు. (చదవండి : నటరాజన్‌ ఎమోషనల్‌ వీడియో వైరల్‌)

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఆడిన నటరాజన్‌ మొత్తం 16 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా స్లాగ్‌ ఓవర్లలో యార్కర్లను సందిస్తూ తనదైన శైలిలో విజృంభించాడు. ఐపీఎల్‌ ప్రదర్శననే పరిగణలోకి తీసుకొని బీసీసీఐ నటరాజన్‌ను ఎంపిక చేసిందనడంలో సందేహం లేదు.కాగా ఆసీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తేడాతో టీమిండియా ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య కాన్‌బెర్రా వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top