IPL 2023: ‘శత’క్కొట్టిన సూర్య... గుజరాత్‌పై ముంబై ఘన విజయం

Mumbai Indians beat Gujarat Titans by 27 runs  - Sakshi

49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 103 నాటౌట్‌

గుజరాత్‌పై ముంబై విజయం

రషీద్‌ ఖాన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన వృథా 

ముంబై: సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌ మరోసారి గర్జించింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ 200 పైచిలుకు పరుగులు నమోదు చేసింది. దాంతో ఐపీఎల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 27 పరుగులతో  నెగ్గి ప్లే ఆఫ్‌ దశకు చేరువైంది. ముందుగా ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది.

ఇషాన్‌ కిషన్‌ (20 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రోహిత్‌ శర్మ (18 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌ (49 బంతుల్లో 103 నాటౌట్‌; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) గుజరాత్‌ బౌలర్ల భరతం పట్టి అజేయ సెంచరీతో మెరిశాడు. చివర్లో విష్ణు వినోద్‌ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. గుజరాత్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ 30 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.

అనంతరం 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి ఓడిపోయింది. 103 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ విజయంపై ఆశలు వదులుకుంది. ఈ దశలో రషీద్‌ ఖాన్‌ (32 బంతుల్లో 79 నాటౌట్‌; 3 ఫోర్లు, 10 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు.  

టాస్‌ గెలిచిన గుజరాత్‌ కెపె్టన్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ ఎంచుకోగా... ముంబై ఓపెనర్లు ఇషాన్‌ కిషన్, రోహిత్‌ దూకుడుగా ఆడారు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 61/0తో ఉంది. పవర్‌ప్లే తర్వాత రషీద్‌ ఖాన్‌ తన తొలి ఓవర్‌ తొలి బంతికి రోహిత్‌ను, ఐదో బంతికి ఇషాన్‌ కిషన్‌ను అవుట్‌ చేశాడు. దాంతో ముంబై తడబడింది. అనంతరం రషీద్‌ తన రెండో ఓవర్లో చివరి బంతికి వధేరా (7 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్‌)ను బౌల్డ్‌ చేశాడు.

ఈ దశలో సూర్యకుమార్, విష్ణు వినోద్‌ ముంబై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సూర్య నెమ్మదిగా జోరు పెంచి 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విష్ణు, డేవిడ్‌ (5) వెంటవెంటనే అవుటైనా మరోవైపు సూర్య హడలెత్తించాడు. మోహిత్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో సూర్య 4,4,6,2,4తో 20 పరుగులు... షమీ వేసిన 19వ ఓవర్లో 6,4,4తో సూర్య సెంచరీకి చేరువ య్యాడు. జోసెఫ్‌ వేసిన చివరి ఓవర్‌ చివరి బంతిని సిక్స్‌గా మలిచి సూర్య సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  

స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్‌ 31; రోహిత్‌ (సి) తెవాటియా (బి) రషీద్‌ 29; సూర్యకుమార్‌ యాదవ్‌ (నాటౌట్‌) 103; వధేరా (బి) రషీద్‌ 15; విష్ణు వినోద్‌ (సి) మనోహర్‌ (బి) మోహిత్‌ 30; టిమ్‌ డేవిడ్‌ (సి అండ్‌ బి) రషీద్‌ 5; గ్రీన్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–61, 2–66, 3–88, 4–153, 5–164. బౌలింగ్‌: షమీ 4–0–53–0, మెహిత్‌ శర్మ 4–0–43–1, రషీద్‌ ఖాన్‌ 4–0–30–4, నూర్‌ అహ్మద్‌ 4–0–38–0, అల్జారి జోసెఫ్‌ 4–0– 52–0.  

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (ఎల్బీడబ్ల్యూ) (బి) మధ్వాల్‌ 2; గిల్‌ (బి) మధ్వాల్‌ 6; హార్దిక్‌ పాండ్యా (సి) ఇషాన్‌ (బి) బెహ్రన్‌డార్ఫ్‌ 4; విజయ్‌ శంకర్‌ (బి) చావ్లా 29; మిల్లర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) మధ్వాల్‌ 41; మనోహర్‌ (బి) కార్తికేయ 2; తెవాటియా (సి) గ్రీన్‌ (బి) చావ్లా 14; రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 79; నూర్‌ అహ్మద్‌ (బి) కార్తికేయ 1; అల్జారి జోసెఫ్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌టాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–7, 2–12, 3–26, 4–48, 5–55, 6–100, 7–100, 8–103. బౌలింగ్‌: బెహ్రన్‌డార్ఫ్‌ 4–0–37–1, ఆకాశ్‌ మధ్వాల్‌ 4–0–31–3, క్రిస్‌ జోర్డాన్‌ 4–0–34–0, పీయూష్‌ చావ్లా 4–0–36–2, కుమార్‌ కార్తికేయ 3–0–37–2, గ్రీన్‌ 1–0–13–0.   

ఐపీఎల్‌లో నేడు 
హైదరాబాద్‌ VS లక్నో  (మ. గం. 3:30 నుంచి)  
ఢిల్లీ  VS పంజాబ్‌ (రాత్రి గం. 7:30 నుంచి)  

స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top