MS Dhoni IPL Viewership: ఏంది ఈ అరాచకం.. రెండు సిక్సర్లకే!

MS Dhoni Smashes Own-Record IPL 2023 Viewership 3-ball-2 sixes Vs LSG - Sakshi

వయసు పెరుగుతుంటే క్రేజ్‌ తగ్గుతుందంటారు.. కానీ ధోని విషయంలో మాత్రం అది రివర్స్‌లా కనిపిస్తుంది. 40 ఏళ్ల వయ​స్సులోనూ తనకున్న క్రేజ్‌ ఇసుమంతైనా తగ్గలేదని ఐపీఎల్‌ 16వ సీజన్‌ చెప్పకనే చెబుతుంది. ఎంతలా అంటే సీఎస్‌కే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ధోని ఒక్కసారి కనిపించినా అటు మైదానంలో తలా అభిమానుల గోల మాములుగా ఉండడం లేదు.. ఇదే అనుకుంటే అతను బ్యాటింగ్‌ చేస్తుంటే జియో సినిమాలో వ్యూయర్‌షిప్‌ రికార్డులు కూడా బద్దలవుతున్నాయి.

అందుకు తగ్గట్లుగానే ధోని కూడా తన ఆట స్టైల్‌ను పూర్తిగా మార్చేశాడు.  ఒకప్పుడు ధోని క్రీజులోకి వస్తే కుదురుకోవడానికి సమయం తీసుకునేవాడు. అలా చాలా మ్యాచ్‌ల్లో నిలబడే ప్రయత్నంలో ఒక్కోసారి ఔటయ్యేవాడు. అయితే ఈసారి ధోని గేర్‌ మార్చాడు. అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న ధోని బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొడితే సిక్సర్‌ లేదంటే బౌండరీ బాదుతూ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు.

తాజాగా సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ ధోని ఇదే స్టైల్‌ను అనుకరించాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఒక సిక్సర్‌, ఒక ఫోర్‌తో ఏడు బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఇక సోమవారం లక్నోతో మ్యాచ్‌లోనూ ధోని అదే దూకుడును ప్రదర్శించాడు. మూడు బంతులాడిన ధోని రెండు సిక్సర్లు కొట్టి ఔటయ్యాడు. అయితే వచ్చిన ప్రతీసారి సిక్సర్లతో విరుచుకుపడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. అభిమానులు కూడా తన నుంచి ఇదే ఆశిస్తున్నారని ధోని గ్రహించాడు. 

ఈ నేపథ్యంలోనే లక్నోతో మ్యాచ్‌లో ధోని కొట్టిన రెండు సిక్సర్లకు స్టేడియం అభిమానుల గోలతో దద్దరిల్లిపోయింది. ధోని మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు మొదలైన అరుపులు అతను ఔట్‌ అయ్యేవరకు కొనసాగాయి. చెపాక్‌ స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో హోరెత్తింది. ఇక మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో ధోని కొట్టిన రెండు సిక్సర్లు మ్యాచ్‌కే హైలైట్‌. మొదటి బంతిని మార్క్‌వుడ్‌ 148.7 కిమీ వేగంతో వేయగా.. థర్డ్‌మన్‌ దిశగా సిక్సర్‌ బాదాడు. అంతే స్టేడియం మొత్తం అరుపులతో దద్దరిల్లింది.

ఈ దెబ్బకు మార్క్‌వుడ్‌ కూడా కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. ఆ తర్వాత బంతిని ధోని మరోసారి సిక్సర్‌ బాదాడు. అంతే స్టేడియంలో అరుపులు ఎంత ఉన్నాయంటే డెసిబల్స్‌ కూడా కొలవలేనంతగా. ఇది కేవలం స్టేడియంలో జరిగిన విధ్వంసం మాత్రమే. ఇక ఐపీఎల్‌ డిజిటల్‌ రైట్స్‌ హక్కులు కొనుగోలు చేసిన జియో సినిమాలో వ్యూయర్‌షిప్‌ రికార్డులు బద్దలయ్యాయి. ధోని కొట్టిన రెండు సిక్సర్లను లైవ్‌లో ఏకకాలంలో 1.7 కోట్ల మంది వీక్షించడం విశేషం. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇది ఆల్‌టైం రికార్డుగా మిగిలిపోయింది.  

ఇంతకముందు గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌ను లైవ్‌లో 1.6 కోట్ల మంది చూశారు. తాజా దానితో ధోని తన రికార్డును తానే బద్దలుకొట్టాడు. ఏంది ఈ అరాచకం.. కేవలం రెండు సిక్సర్లకే ఇలా రికార్డులు బద్దలయితే.. ధోని ఎక్కువసేపు క్రీజులో ఉంటే ఎలా ఉంటుందనేది ఊహించుకోవడానికి భయంగా ఉంది అంటూ కొంతమంది ఫ్యాన్స్‌ పేర్కొన్నారు. మనకు తెలిసి ఒక క్రికెటర్‌ను ఇంతలా అభిమానించడం ఈ మధ్య కాలంలో ఎక్కడా చూసి ఉండం.. ధోనినా మజాకా.

చదవండి: 'వాట్‌ యాన్‌ ఐడియా సర్‌ జీ'..  ఈ దెబ్బతో బౌలర్లు దారిలోకి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top