'పిచ్‌ను నిందించడం కాదు.. ఫుట్‌వర్క్‌పై దృష్టి పెట్టండి'

Mohammed Azharuddin Says Batsmen Focus On Foot Work Rather Than Pitch - Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జ‌రిగిన పింక్‌ బాల్‌ టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఆ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ ఔటైన తీరు ప‌ట్ల టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ అజారుద్దీన్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. పిచ్‌పై నింద వేయ‌డం క‌న్నా.. షాట్ సెల‌క్ష‌న్‌, ఫుట్‌వ‌ర్క్‌పై దృష్టి పెట్టాల‌ని సూచించాడు. పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా విజయం అనంతరం అజారుద్దీన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

''అహ్మ‌దాబాద్ టెస్టులో స్పిన్నర్ల దాటికి బ్యాట్స్‌మెన్ కుప్ప‌కూల‌డం నిరుత్సాహాప‌రిచింది. అలాంటి డ్రై ట్రాక్‌ల‌పై బ్యాటింగ్ చేయాలంటే.. షాట్ల ఎంపికతో పాటు ఫుట్‌వ‌ర్క్ కీలకపాత్ర పోషిస్తుంది.బ్యాటింగ్ స‌మ‌యంలో స్పైక్ షూ ధ‌రించ‌డం వ‌ల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు. ఇలాంటి పిచ్‌ల‌పై ర‌బ్బ‌ర్ సోల్ ఉన్న షూల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల బ్యాట్స్‌మెన్ సామ‌ర్థ్యం త‌గ్గదు. బ్యాటింగ్‌కు అనుకూలించని ఇలాంటి నిర్జీవ‌మైన మైదానాల్లో ఉత్తమ టెస్ట్ ఇన్నింగ్స్‌ల‌ను ఎన్నో చూశాను. గతంలో ఇలాంటి పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ కేవ‌లం ర‌బ్బ‌ర్ సోల్స్ ధ‌రించి రాణించారు.

ర‌బ్బ‌ర్ షూ ధ‌రించిన ఆట‌గాళ్లు పిచ్‌పై జారిప‌డుతార‌న్న వాద‌న‌ తప్పు. వింబుల్డ‌న్ లాంటి టెన్నిస్ టోర్నీల్లో ప్లేయ‌ర్లు ర‌బ్బ‌ర్ షూల‌తోనూ ఆడుతున్నారు. గ‌తంలో టీమిండియా దిగ్గజాలు సునీల్ గ‌వాస్క‌ర్‌, మోహింద‌ర్ అమ‌ర్‌నాథ్‌, దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌తో పాటు విండీస్ దిగ్గ‌జం వివియ‌న్ రిచ‌ర్డ్స్‌, మైక్ గ్యాటింగ్‌, అలెన్ బోర్డ‌ర్‌ లాంటి వాళ్లు ర‌బ్బ‌ర్ సోల్ ఉన్న షూతోనే ఆడేవారు. డ్రై పిచ్‌ల‌పై ర‌బ్బ‌ర్ సోల్ ఉన్న షూస్‌ను ప్రిఫర్‌ చేయ‌డం మంచిదని నా అభిప్రాయం'' అని చెప్పుకొచ్చాడు. 
చదవండి: 'కోహ్లి మాటలు నాకు కోపం తెప్పించాయి'
టెస్టు క్రికెట్‌కు మంచిది కాదు; అశ్విన్‌ సీరియస్‌ ట్వీట్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top