ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ లేటుగా అయినా లేటెస్ట్‌గా లైన్‌లోకి వచ్చింది. నిన్న (మే 4) లక్నో సూపర్ జెయింట్స్‌పై భారీ విజయం సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడమే కాకుండా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఈ జట్టు.. ఐపీఎల్ చరిత్రలో తమ అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది.
ఐపీఎల్‌లో లక్నోపై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక సార్లు (7) 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించిన జట్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ (6), సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను (6) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో పంజాబ్ (11) మాత్రమే ముంబై ముందుంది.
ఈ భారీ రికార్డులు నెలకొల్పే క్రమంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా ఓ వ్యక్తిగత రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 7 సిక్సర్లు బాదిన అతను.. ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును నమోదు చేశాడు. తొలి వికెట్‌కు ర్యాన్ రికెల్టన్‌తో కలిసి 143 పరుగులు జోడించిన రోహిత్.. ముంబై ఇండియన్స్ పై రికార్డులు నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించాడు.
రోహిత్ శర్మ (83), రికెల్టన్ (84) చెలరేగడంతో లక్నో నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతకుముందు నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63; ఫోర్, 8 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖర్లో ఎయిడెన్ మార్క్రమ్ (25 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, సిక్స్), హిమ్మత్ సింగ్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించారు.


