'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది'

Mark Waugh Slams David Warner After Early Exit In Sydney Test - Sakshi

సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 3వ ఓవర్లోనే ఔట్‌అయిన సంగతి తెలిసిందే. 5 పరుగులు చేసిన వార్నర్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వార్నర్‌ అవుట్‌ కావడంపై ఆసీస్‌ మాజీ ఆటగాడు మార్క్‌వా అసంతృప్తి వ్యక్తం చేశాడు.వార్నర్‌ ఔట్ అయిన విధానం నాకు నచ్చలేదు. ఒక లూజ్‌ షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు. మ్యాచ్‌ ఆరంభమైన 20 నిమిషాలకే ఆ షాట్‌ ఎందుకు ఆడాడో అర్థం కాలేదు. టెస్టు మ్యాచ్‌లో ఆరంభం నుంచి దూకుడు అవసరం లేదనే విషయం వార్నర్‌కు తెలుసు... అయినా తొందరపడ్డాడు. కాస్త ఓపికగా వ్యవహరించి ఉంటే బాగుండేది. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని వదిలేయకుండా ఒక లూజ్‌ షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకోవడం కరెక్ట్‌ కాదు అంటూ మార్క్‌వా చెప్పుకొచ్చాడు. (చదవండి: రిషభ్‌ పంత్‌పై ట్రోలింగ్‌.. సైనీ తొలి వికెట్‌!)

మరో మాజీ ఆటగాడు మైకెల్‌ హస్సీ కూడా వార్నర్‌ షాట్‌పై పెదవి విరిచాడు. వార్నర్‌ బాడీ లాంగ్వేజ్‌లో చాలా తేడా కనిపించింది. అతను వంద శాతం ఫిట్‌గా లేకున్నా మ్యాచ్‌లోకి బరిలోకి దిగాడనిపిస్తుంది. షాట్‌ ఎంపికలో వార్నర్‌ పొరపాటు  స్పష్టంగా తెలుస్తుందంటూ తెలిపాడు. కాగా టీమిండియాతో జరిగిన రెండో వన్డే అనంతరం గాయపడిన వార్నర్‌ చివరి వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. మొదట టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని భావించినా గాయం తీవ్రత తగ్గకపోవడంతో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు.(చదవండి: మహ్మద్‌ సిరాజ్‌ కంటతడి)

అయితే మూడో టెస్టుకు ఎంపిక చేసే సమయానికి వార్నర్‌ 100శాతం ఫిట్‌గా లేకున్నా క్రికెట్‌ ఆస్రేలియా అతన్ని తుది జట్టులోకి తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా వార్నర్‌ మూడో టెస్టులో త్వరగా ఔట్‌ కావడంతో మరోసారి అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు తలెత్తాయి. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా 55 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్ 67 పరుగులతో‌, స్టీవ్‌ స్మిత్ 31 పరుగులతో‌ క్రీజులో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top