సౌతాఫ్రికా క్రికెట్‌కు భారీ షాక్

Mark Boucher To Step Down As SA Head Coach: ఇంగ్లండ్ చేతిలో 1-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ అనంతరం జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు మార్క్ బౌచర్ నిన్న (సెప్టెంబర్ 12) ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ) సైతం ధృవీకరించింది.
2019 డిసెంబర్‌లో సౌతాఫ్రికా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బౌచర్.. గత మూడేళ్ల కాలంలో సౌతాఫ్రికాకు అపురూప విజయాలు అందించాడు. సౌతాఫ్రికాను ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో (ప్రస్తుతం) నిలిపాడు. బౌచర్ హయాంలో సఫారీ టీమ్ 11 టెస్టులు, 12 వన్డేలు, 23 టీ20ల్లో విజయం సాధించింది. ఇందులో ఈ ఏడాది టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ (2-1) విజయం కూడా ఉంది. సీఎస్‌ఏతో బౌచర్ కాంట్రాక్ట్ 2023 వరల్డ్ కప్ వరకు ఉన్నప్పటికీ.. త్వరలో ప్రారంభంకానున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ ఫ్రాంచైజీ కోచింగ్ బాధ్యతలు చేపట్టే నిమిత్తం సీఎస్‌ఏతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
బౌచర్ దక్షిణాఫ్రికా కోచ్‌గా తన చివరి ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్‌లో ఆడనున్నాడు. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 11 వరకు జరుగనున్న 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌లు బౌచర్‌కు సౌతాఫ్రికా కోచ్‌గా ఆఖరివి. అనంతరం జరగనున్న టీ20 ప్రపంచకప్ (అక్టోబరు 16 నుంచి నవంబరు 13) తర్వాత అతను సౌతాఫ్రికా కోచ్ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలగనున్నాడు.
సంబంధిత వార్తలు