RCB: ఫామ్‌లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు? | Sakshi
Sakshi News home page

అతడిని ఎందుకు ఆడించలేదు.. ఆర్సీబీపై మాజీ క్రికెటర్‌ విమర్శలు

Published Sun, Apr 7 2024 10:38 AM

Mahipal Plays On This Pitch In: Irfan Pathan questions RCB for Omitting Him - Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహిపాల్‌ లామ్రోర్‌కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టాడు.

కాగా ఐపీఎల్‌-2024లో భాగంగా శనివారం రాజస్తాన్‌తో తలపడ్డ ఆర్సీబీకి భంగపాటు తప్పలేదు. జైపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్‌లో నాలుగో ఓటమి నమోదు చేసింది.

స్టార్‌ ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి అజేయ శతకం(113)తో వృథాగా పోగా.. జోస్‌ బట్లర్‌ సెంచరీ(100- నాటౌట్‌) రాజస్తాన్‌ను గెలిపించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌ ద్వారా ఆర్సీబీ బ్యాటర్‌ సౌరవ్‌ చౌహాన్‌ ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. అయితే అరంగేట్రంలో ఈ గుజరాత్‌ ఆటగాడు ప్రభావం చూపలేకపోయాడు.

సౌరవ్‌ అరంగేట్రంలో ఇలా
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసిన లెఫ్టాండర్‌ సౌరవ్‌.. యజువేంద్ర చహల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా నామినేట్‌ చేసిన మహిపాల్‌ లామ్రోర్‌ సేవలను ఉపయోగించుకోలేకపోయింది ఆర్సీబీ.

ఫామ్‌లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు?
ఈ విషయంపై స్పందించిన ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆర్సీబీ వ్యూహాలపై పెదవి విరిచాడు. ‘‘ దేశవాళీ క్రికెట్‌లో మహిపాల్‌ లామ్రోర్‌ ఈ పిచ్‌పై ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఈరోజు అతడికి ఆర్సీబీ తుదిజట్టులో చోటు కల్పించలేదు.

అతడు ఫామ్‌లోనే ఉన్నాడు కూడా! అయినా ఇలా ఎందుకు చేశారో తెలియదు. భారత కోచ్‌లు కూడా ఐపీఎల్‌ విషయాల్లో కాస్త జోక్యం చేసుకుంటే.. ఇలాంటి ప్రాథమిక తప్పిదాలు జరగవు. ప్రతిభ ఉన్నవాళ్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయన్న దానికి ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.

ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన లామ్రోర్‌
కాగా రాజస్తాన్‌లోని నాగౌర్‌కు చెందిన లెఫ్టాండ్‌ బ్యాటర్‌ మహిపాల్‌ లామ్రోర్‌  ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 32 మ్యాచ్‌లు ఆడిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. 452 పరుగులు చేశాడు. లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌ అయిన అతడు ఒక వికెట్‌ కూడా తీశాడు.

ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆర్సీబీ సాధించిన ఒకే ఒక్క విజయం(పంజాబ్‌పై)లోనూ లామ్రోర్‌ కీలక పాత్ర పోషించాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేవలం 8 బంతుల్లోనే 17 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే 33 రన్స్‌ చేశాడు.

రాజస్తాన్‌ వర్సెస్‌ ఆర్సీబీ స్కోర్లు:
►వేదిక: జైపూర్‌.. సవాయి మాన్‌సింగ్‌ స్టేడియం
►టాస్‌: రాజస్తాన్‌.. బౌలింగ్‌
►ఆర్సీబీ స్కోరు:  183/3 (20)

►రాజస్తాన్‌ స్కోరు: 189/4 (19.1)
►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై రాజస్తాన్‌ గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జోస్‌ బట్లర్‌(రాజస్తాన్‌).

చదవండి: Virat Kohli: స్లో ఇన్నింగ్స్‌ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే

Advertisement
 

తప్పక చదవండి

Advertisement