MS Dhoni: ధోనికి సీఎస్‌కే అంటే ప్రాణం! ఆ జట్టులో ఉన్నపుడు చెన్నై గురించి చెబుతూ ఉద్వేగానికి లోనయ్యేవాడు! ఈ దృశ్యాలు చూస్తుంటే!

Kevin Pietersen: Dhoni Love For CSK When With RPS He Got So Emotional - Sakshi

MS Dhoni- CSK: టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోనికి చెన్నై అన్నా.. అక్కడి మనుషులన్నా మహా ఇష్టమని.. నగరంతో అతడి అనుబంధం విడదీయలేనిదని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుపైనా మిస్టర్‌ కూల్‌కు అమితమైన ప్రేమ ఉందని పేర్కొన్నాడు. 

అదే విధంగా ధోని పట్ల కూడా చెన్నై ప్రజలకు ఉన్న ప్రేమ వెలకట్టలేదని.. చెపాక్‌లో ఆదివారం నాటి దృశ్యాలే ఇందుకు నిదర్శనమని పీటర్సన్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌-2023 లీగ్‌ దశలో సీఎస్‌కే ఆదివారం తమ ఆఖరి మ్యాచ్‌ ఆడేసింది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అన్న వార్తల నేపథ్యంలో.. మైదానంలో చోటుచేసుకున్న దృశ్యాలు ఇందుకు బలాన్ని చేకూర్చాయి.

అరుదైన దృశ్యాలు
కేకేఆర్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి తర్వాత ధోని ముందుండి నడుస్తుండగా సీఎస్‌కే బృందం అతడిని అనుసరించింది. ఈ సందర్భంగా ధోని తాను సంతకం చేసిన టెన్నిస్‌ బంతులను స్టాండ్స్‌లోకి విసరగా.. వాటిని అందుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు.

ఇక టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అయితే ఏకంగా తన షర్టు మీద ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం హైలైట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో పీటర్సన్‌ మాట్లాడుతూ ధోనితో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.

అలాంటి కెప్టెన్‌ ఉంటే
‘‘ధోని ఆటగాళ్లందరికీ స్ఫూర్తిదాయకం. అతడి కోసమైనా మనమంతా జట్టుగా బాగా ఆడాలి అనే ఫీలింగ్‌ వస్తుంది. అతడి కెప్టెన్సీ అలా ఉంటుంది మరి! గత కొన్నేళ్లుగా మిస్టర్‌ కూల్‌ను చూస్తూనే ఉన్నాం. 

జట్టు పట్ల, ఆటగాళ్ల పట్ల అతడు పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తాడు. అలాంటి కెప్టెన్‌ ఉంటే ప్లేయర్లంతా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతారు’’ అని పీటర్సన్‌ ధోనిపై ప్రశంసలు కురిపించాడు.

ధోని ఉద్వేగానికి లోనయ్యేవాడు
ఇక రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు ఆడే సమయంలో ధోనిని దగ్గరగా గమనించానన్న పీటర్సన్‌.. ధోనికి సీఎస్‌కే అంటే ఎంతో ఇష్టమని, ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ అతడు భావోద్వేగానికి లోనయ్యేవాడని గుర్తు చేసుకున్నాడు. కేవలం క్రికెటర్‌గానే కాకుండా వ్యక్తిగా కూడా ధోని ఒక అద్భుతం అంటూ కొనియాడాడు.

‘‘ధోని చూసేందుకు జనాలు ఎలా ఎగబడుతున్నారో చూడండి. తనని తాకేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కేవలం ఓ క్రికెటర్‌గానే కాదు మనిషిగానూ అతడిది అసాధారణ వ్యక్తిత్వం. ఈ అద్భుత దృశ్యాలు ఇందుకు నిదర్శనం. భావోద్వేగ క్షణాలు. చూడటానికి ఎంతో బాగుంది’’ అని పీటర్సన్‌ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు.

కాగా ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో  సీఎస్‌కేపై నిషేధం విధించగా.. 2016, 2017 సీజన్లలో ధోని పుణె ఫ్రాంఛైజీకి మారిన ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో పీటర్సన్‌ ధోనితో కలిసి ఆడాడు. 

చదవండి: ‘వివాదాస్పద సాఫ్ట్‌ సిగ్నల్‌’ రూల్‌ రద్దు! ఆ మ్యాచ్‌ నుంచే అమలు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top