IPL 2024: ధోని ఫ్యాన్స్‌తో అట్లుంది మరి.. భరించలేకపోయిన రసెల్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024: ధోని ఫ్యాన్స్‌తో అట్లుంది మరి.. భరించలేకపోయిన రసెల్‌

Published Tue, Apr 9 2024 2:01 PM

IPL 2024 CSK VS KKR: Russell Cant Bear Loud Cheer For Dhoni - Sakshi

క్రికెట్‌ సర్కిల్స్‌లో ఎంఎస్‌ ధోనికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆన్‌ ఫీల్డ్‌, ఆఫ్‌ ద ఫీల్డ్‌ అన్న తేడా లేకుండా ధోని ఎక్కడ కనిపించినా అభిమానులు కేరింతలు పెడతారు. ధోని హోం గ్రౌండ్‌ (ఐపీఎల్‌) చెపాక్‌ స్టేడియంలో అయితే క్రేజ్‌ వేరే లెవెల్లో ఉంటుంది. ధోని స్క్రీన్‌పై కనిపిస్తే చాలు స్టేడియం మొత్తం హోరెత్తిపోతుంది. ధోని నామస్మరణతో వచ్చే సౌండ్‌లకు చెవులు చిల్లులు పడతాయి. 

నిన్న సీఎస్‌కే, కేకేఆర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌కు దిగుతుండగా అభిమానులు చేసిన రచ్చ నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంది. ఆ సమయంలో ధోని ఫ్యాన్స్‌ చేసిన సౌండ్‌లకు మైదానంలో ఉన్నవారి కర్ణభేరులు పగిలిపోయుంటాయి. ధోని బరిలోకి దిగుతున్న సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న కేకేఆర్‌ ఆటగాడు రసెల్‌ అయితే ఫ్యాన్స్‌ చేసిన శబ్దాలు తట్టుకోలేక చెవులు మూసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు అట్లుంటది ధోని ఫ్యాన్స్‌తోని అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కాగా, నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్‌ (4-0-18-3) చేసి సీఎస్‌కేను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ జడ్డూ ధాటికి 137 పరుగులకే పరిమితం కాగా.. ఛేదనలో రుతురాజ్‌ కెప్టెన్స్‌ ఇన్నింగ్స్‌ (67 నాటౌట్‌) ఆడి సీఎస్‌కేను విజయతీరాలకు చేర్చాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్‌ దేశ్‌పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్‌ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్‌ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. సాల్ట్‌ (0), వెంకటేశ్‌ అయ్యర్‌ (3), రింకూ సింగ్‌ (9), రసెల్‌ (10) తస్సుమనిపించారు. నరైన్‌ (27), రఘువంశీ (24), శ్రేయస్‌ అయ్యర్‌ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కేను రుతురాజ్‌ (67 నాటౌట్‌) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడి గెలిపించాడు. రచిన్‌ రవీంద్ర 15, డారిల్‌ మిచెల్‌ 25, శివమ్‌ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లు) చేసి ఔట్‌ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కేకేఆర్‌ బౌలర్లలో వైభవ్‌ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్‌కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్‌ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్‌ రెండో స్థానంలో ఉంది.


 

Advertisement
Advertisement