ఫేవ‌రెట్‌గా ముంబై.. భ‌యం గుప్పిట్లో కేకేఆర్‌! | IPL 2026 MI Vs KKR Match Head To Head Records, Team Prediction And Other Important Details Inside | Sakshi
Sakshi News home page

MI Vs KKR: ఫేవ‌రెట్‌గా ముంబై.. భ‌యం గుప్పిట్లో కేకేఆర్‌!

Mar 29 2026 12:23 PM | Updated on Mar 29 2026 1:50 PM

IPL 2026: MI Vs KKR Match Head To Head And Team Prediction

ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో ఇవాళ ముంబై ఇండియ‌న్స్‌తో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఫేవ‌రెట్‌గా ముంబై కనిపిస్తున్న‌ప్ప‌టికీ కేకేఆర్‌ను కూడా త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. కానీ రెండు జ‌ట్ల‌లో కేకేఆర్‌పై ఒత్తిడి కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే ముంబైని వారి సొంత గ్రౌండ్‌లో  కేకేఆర్ ఇప్ప‌టివ‌ర‌కు రెండుసార్లు మాత్ర‌మే ఓడించ‌గలిగింది. 

వాంఖడేలో ఇరు జ‌ట్ల మ‌ధ్య 12 మ్యాచ్‌లు జ‌రిగితే 10 సార్లు ముంబై విజ‌యం సాధించ‌డం విశేషం. అయితే ఈసారి దానిని తిర‌గ‌రాసి విజ‌యంతో సీజ‌న్‌ను ఆరంభించాల‌ని కేకేఆర్ ఉవ్విళ్లూరుతుంది. మ‌రోవైపు ముంబై టైటిల్ ఫేవ‌రెట్ల‌లో ఒక‌టిగా బ‌రిలోకి దిగుతున్న‌ప్ప‌టికీ, దాదాపు ప్ర‌తీ ఐపీఎల్‌ సీజ‌న్‌ను ముంబై ఓట‌మితోనే ప్రారంభించిన దాఖ‌లాలున్నాయి. 

మ‌రి ఈసారి తొలి మ్యాచ్‌లోనే విజ‌యం సాధించి దానికి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. ముంబై ఇండియ‌న్స్ ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) చాంపియ‌న్స్‌గా నిలిచింది. 2020లో చివ‌రిసారి ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై అప్ప‌టినుంచి ఆరో టైటిల్ కోసం నిరీక్షిస్తూనే వ‌స్తోంది. 

మూడుసార్లు (2012, 2014, 2024) ఐపీఎల్ విజేత‌గా నిలిచిన కేకేఆర్ మ‌రో టైటిల్ కొట్టాల‌నే ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగుతోంది. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజ‌న్ నుంచి చూసుకుంటే ఇప్ప‌టిరవ‌ర‌కు 35 సార్లు త‌ల‌ప‌డ‌గా ముంబై 24 సార్లు నెగ్గితే, కేకేఆర్ 11 సార్లు విజ‌యం సాధించింది. బ‌ల‌బ‌లాల విష‌యానికొస్తే.. కేకేఆర్‌తో పోలిస్తే ముంబై బ్యాటింగ్ లైన‌ప్ కాస్త బ‌లంగా ఉంది. 

ఇటీవ‌లే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన టీమిండియాలోని న‌లుగురు (పాండ్యా, సూర్య‌కుమార్‌, తిల‌క్ వ‌ర్మ‌, బుమ్రా) ముంబై జ‌ట్టులో ఉండ‌డం బ‌ల‌మ‌ని చెప్పొచ్చు. వీరితో స‌హా రూథ‌ర్‌ఫోర్డ్‌, రికిల్‌ట‌న్‌లతో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్లుగా మయాంక్ లేదా శార్ధూల్ కూడా కీల‌కం కానున్నారు. బౌలింగ్‌లో బుమ్రా మ‌రోసారి కీలకం కానుండ‌గా, కివీస్ మాజీ బౌల‌ర్ బౌల్ట్ కూడా ప్ర‌మాదకారే.

ఇక కేకేఆర్ బ్యాటింగ్ విష‌యానికొస్తే ర‌హానే, సునీల్ నరైన్‌, సీఫెర్ట్‌,  రఘువంశీ, రింకూ సింగ్‌తో పాటు ఆల్‌రౌండ‌ర్లు ర‌మ‌ణ్‌దీప్, కామెరున్ గ్రీన్‌లు కీల‌కం కానున్నారు. బౌలింగ్ విభాగంలో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, వైభ‌వ్ అరోరా, ముజ‌రబానీ కీల‌కం. కేకేఆర్‌పై రోహిత్ శ‌ర్మ 127 స్ట్రైక్‌రేట్‌తో 967 ప‌రుగులు సాధించ‌గా, సునీల్ న‌రైన్ ముంబైతో ఆడిన మ్యాచ్‌ల్లో 26 వికెట్లు ప‌డగొట్టాడు.

ముంబై తుది జ‌ట్టు అంచ‌నా: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ‌, రియాన్ రికిల్‌ట‌న్ (వికెట్ కీప‌ర్‌), తిల‌క్ వ‌ర్మ‌, సూర్య‌కుమార్‌, రూథ‌ర్‌ఫోర్డ్‌, న‌మ‌న్ ధిర్‌, గ‌జ‌న్‌ఫ‌ర్‌, దీప‌క్ చాహ‌ర్‌, ట్రెంట్ బౌల్ట్‌, బుమ్రా

ఇంపాక్ట్ ప్లేయ‌ర్లు: మ‌యాంక్ మార్కండే/ శార్దూల్ ఠాకూర్‌

కేకేఆర్ తుది జ‌ట్టు అంచ‌నా: అజింక్యా ర‌హానే (కెప్టెన్‌), సునీల్ న‌రైన్‌, టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీప‌ర్‌)/ ఫిన్ అలెన్‌, కామెరున్ గ్రీన్‌, అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ, రింకూ సింగ్‌, ర‌మ‌న్‌దీప్ సింగ్‌, అనుకుల్ రాయ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, వైభ‌వ్ అరోరా, ముజ‌ర‌బానీ

ఇంపాక్ట్ ప్లేయ‌ర్స్‌: రాహుల్ త్రిపాఠి/ కార్తిక్ త్యాగి 

చదవండి: ‘బౌల‌ర్ల వైఫ‌ల్యం మా కొంపముంచింది’

Advertisement
 
Advertisement
Advertisement