IPL 2024: సీఎస్‌కేను చిత్తు చేసిన పంజాబ్‌.. ఘనమైన రికార్డు | Sakshi
Sakshi News home page

IPL 2024: సీఎస్‌కేను చిత్తు చేసిన పంజాబ్‌.. ఘనమైన రికార్డు

Published Thu, May 2 2024 10:03 AM

IPL 2024: Punjab Is The 2nd Team After Mumbai To Defeat CSK In 5 Consecutive Matches

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ లేటుగా మేల్కొంది. ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం అయ్యాక వరుస విజయాలు సాధిస్తుంది. సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌, నాలుగో మ్యాచ్‌ గెలిచిన పంజాబ్‌.. ఇప్పుడు వరుసగా తొమ్మిది, పది మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌వైపు ఆశగా చూస్తుంది.

ప్రస్తుతం పంజాబ్‌ 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. నిన్న (మే 1) సీఎస్‌కేపై గెలుపు పంజాబ్‌లో ‍కొత్త జోష్‌ నింపింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించి సీఎస్‌కేను 7 వికెట్ల తేడాతో చిత్తు చేశారు.

పంజాబ్‌ ఈ సీజన్‌లో మరో నాలుగు మ్యాచ్‌లు గెలవాల్సి ఉండగా.. అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. మిగతా జట్లు కూడా మరో నాలుగైదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ప్లే ఆఫ్స్‌ బెర్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది.

పంజాబ్‌ ఖాతాలో ఘనమైన రికార్డు..
నిన్నటి మ్యాచ్‌లో సీఎస్‌కేను చిత్తు చేసిన పంజాబ్‌ ఓ అరుదైన ఘనత సాధించింది. ముంబై ఇండియన్స్‌ తర్వాత ఐపీఎల్‌లో సీఎస్‌కేను వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. పంజాబ్‌కు సీఎస్కే హోం గ్రౌండ్‌ అయిన చెపాక్‌లో ఇది నాలుగో విజయం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ (5) మాత్రమే సీఎస్‌కేను వారి సొంత మైదానంలో ఇన్ని మ్యాచ్‌ల్లో ఓడించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ (62) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ మినహా ఎవ్వరూ రానించలేదు. రహానే 29, సమీర్‌ రిజ్వి 21, మొయిన్‌ అలీ 15, ధోని 14 పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లు రాహుల్‌ చాహర్‌ (4-0-16-2), హర్ప్రీత్‌ బ్రార్‌ (4-0-17-2), రబాడ (4-0-23-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌.. ఆడుడూపాడుతూ 17.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జానీ బెయిర్‌స్టో (46), రిలీ రొస్సో (43), శశాంక్‌ సింగ్‌ (25 నాటౌట్‌), సామ్‌ కర్రన్‌ (26 నాటౌట్‌) పంజాబ్‌ను గెలిపించారు. 

Advertisement
Advertisement